వైసీపీ టంగ్ ట్విస్టర్.. మూడంటే మూడు కాదు ఒకటే!

మూడు రాజధానుల మూడుముక్కలాటలో వైసీపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మూడంటే మూడని కాదు అని చెబుతోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అనీ.. అది అమరావతి కాదు.. విశాఖపట్నం అని అంటోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే.. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తారో అదే రాజధాని అని చెబుతున్నారు. ఇందు కోసం మూడు రాజధానులంటూ రాద్ధాంతం ఎందుకని ప్రకటిస్తున్నారు. సీఎం తనకు ఇష్టమొచ్చిన నగరం నుంచి పాలన సాగించవచ్చనీ, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని చెబుతున్నారు.

ఇంతోటి దానికి మూడు రాజధానులంటూ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. కోర్టులు మొట్టికాయలు వేయడంతో వాటిని ఉపసంహరించుకోవడం.. మళ్లీ తగుదునమ్మా అంటూ మూడు రాజధానులే ముద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేయడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు.  ఇంత కాలం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు. కర్నూలు న్యాయరాజధాని, అమరావతి శాసన రాజధాని, ఇక విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ చెబుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ స్వరం మారింది.. ధోరణి మారింది. ఉత్తరాంధ్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి ఒకటే రాజధాని అని కుండ బద్దలు కొట్టేశారు. అయితే ఆ ఏకైక రాజధాని అమరావతి కాదు.. విశాఖపట్నం అని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయం పార్టీ అభిప్రాయమా.. లేక ధర్మాన సొంత పైత్యమా అన్నది పక్కన పెడితే.. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో రాద్ధాంతం ఎందుకని ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టంగా చెప్పారు. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగించాలనుకుంటే అక్కడ నుంచి సాగించవచ్చనీ.. దీనిని ఎవరూ అడ్డుకో జాలరనీ కూడా చెప్పేశారు.

అంతే కాదు.. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తే అక్కడే కేబినెట్ కూడా ఉంటుందనీ, అక్కడే సచివాలయం కూడా ఉండాలని జగన్ చెప్పారు. అంటే తాను విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నాననీ, అందుకే అక్కడే సచివాలయం ఉంటుందనీ, అక్కడే కేబినెట్ కూడా ఉంటుందని అందుకే ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుందనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాశారు. మరి శాసన కేపిటల్, న్యాయ రాజధాని అంటూ ఇంత కాలం ఆడిన డ్రామాకు అర్ధమేమిటో జగన్ చెప్పి తీరాలి. ఇది అలా ఉంచితే.. ఇప్పుడు ధర్మాన తాజాగా ఎత్తుకున్న ఏపీకి ఏకైక రాజధాని విశాఖ పట్నమే అన్న విషయానికి వస్తే.. కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ అది న్యాయ రాజధాని కాదు.. అలాగే అసెంబ్లీ అమరావతిలోనే కొనసాగినంత మాత్రాన అది శాసన రాజధాని కాదు అని చెబుతున్నారు.   వరుసగా సదస్సులు నిర్వహిస్తూ ఆయన చెబుతున్న మాట ఇదే. ఇప్పుడు జనగ్ మాటలను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన కూడా ఏపీ రాజధాని విశాఖపట్నమే అవుతుంది కానీ.. ఇంత కాలం తాము చెబుతూ ఉన్న మూడు రాజధానులు అన్న మాటే ఉండదని అర్ధమౌతుంది.  ఇందుకు ఉదాహరణలుగా  ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన ఇప్పుడు తాపీగా ఎవరికీ తెలియని రహస్యమన్నట్లు చెబుతున్నారు.

అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని చెబుతూ.. అంత మాత్రాన ఆయా రాష్ట్రాలలో న్యాయరాజధాని అంటూ హైకోర్టు ఉన్న  నగరాలను రాజధానులని ఎవరూ పిలవడం లేదన్న ధర్మాన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్తగా రాయల సీమ ప్రాంతంలో ఆందోళనలు అంకురించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకలు అంటున్నారు.

తాజాగా జగన్, ధర్మానలు చేస్తున్న వాదన వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే అని వివరిస్తున్నారు.  అసలిదంతా ఎందుకంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి.. ప్రజల సెంటిమెంటును రగిలిస్తే తప్ప వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం అసాధ్యమన్న అభిప్రాయానికి వైసీపీ అగ్రనాయకత్వం వచ్చేయడంతోనే ఇప్పుడొ  ఏకైక రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడానికి ఇదే కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu