వివేకా హత్య కేసు విచారణ బయటి రాష్ట్రానికి బదలీపై సుప్రీం ఆదేశాలు నేడు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం(నవంబర్ 1) ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే కేసు మరో రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు ఏ రాష్ట్రానికి బదిలీ అన్న విషయంపై నవంబర్ 1న ఉత్తర్వులు ఇవ్వనున్నట్ల పేర్కొన్న సంగతి విదితమే. తన తండ్రి హత్య కేసు విచారణ ఇతర రాష్ట్రానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. కేసు వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించి గత నెల(అక్టోబర్) 19న  తీర్పు రిజర్వ్ చేసిన సంగతి విదితమే. 

 స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించింది. 

దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసు తార్కిక ముగింపు దిశగా సాగుతోందనీ? ఈ కేసు విషయంలో దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారనీ? ఇంతకాలం వెల్లువెత్తిన అనుమానాలను  దేశ సర్వోన్నత న్యాయస్థానం నమ్మిందని స్పష్టమౌతోంది.   తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాల్సిందేనన్న పట్లు దలతో ఉన్నారు.

ఇందుకోసం ఆమె సాహసోపేతమైన పోరాటమే చేశారు. ఆ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేకానందరడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తే ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు.

ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ స్వంత మీడియాలో పదే పదే చెప్పించడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి.

సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసిందంటే  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అంతకంటే దారుణమైన అవమానం వేరొ కటి వుండదు. పాత రోజులలో అయితే అటు ముఖ్యమంత్రి, ఇటు డిజిపి వంటి ఉన్నతా ధికారులు సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడితే  వెంటనే పదవులు వదిలేసే వారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో అటువంటి నైతికతకు చోటు లేని పరిస్థితి ఉంది.

అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడినా జగన్ సర్కార్ లో ఎటువంటి చలనం లేదు. అయితే సుప్రీం ఆదేశాలతో  వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అయితే (ఇప్పటికే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి సుప్రీం అంగీకరించింది. అయితే  నేరస్తులకు ఉచ్చు బిగుసుకున్నట్లే అని పరిశీలకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.

 ఇదే సమయంలో వివేకా హత్య పై జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు హత్యకు కారణమేమిటో, హత్య చేసిన వారెవరో చెప్పకనే చెప్పేశాయని పరిశీలకులు అంటున్నారు. తన చిన్నాన్నను చంపారని, చంపిన వారెవరో అందరికీ తెలుసని ప్రకటించా రామె.

ఆమె నోటి వెంట ఆ మాట వెలువడడం వైఎస్ కుటుంబాన్ని చిక్కులలోకి నెడుతున్నది. ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంపీ సీటు కోసమే తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో... ఇప్పటి దాకా కేసును నీరుగార్చడానికి పోలీసు యంత్రాంగం చేసిన ప్రయత్నాలతో వివేకా హత్య కేసులో నేరస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని, చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu