ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ... 20 లక్షల మందిని గుర్తుంచిన ఏపీ ప్రభుత్వం

ఇళ్ల పట్టాల పంపిణీ పై ఏపీ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 20 లక్షల మంది లబ్ధిదారులని గుర్తించిన ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం 40,000 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తుంది. అందుబాటులో సుమారు 22,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మరో 18,000 ఎకరాల ప్రైవేటు భూమి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు భూముల కొనుగోలుకు 10,000 కోట్లు ఖర్చవుతాయని భూమి కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం రుణం తీసుకోవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా రుణానికి సర్కార్ కసరత్తు చేస్తుంది. సర్కారుకు పది వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎల్ఐసీ అంగీకరించినట్లు సమాచారం.దీనికి సంబంధించి కసరత్తును ముమ్మరం చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రధానంగా కనిపిస్తుంది.

మొదటిగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందివ్వాలని నిర్ణయించారు. ఉగాది నాటికి పూర్తిస్థాయిలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందివ్వాలన్న డెడ్ లైన్ ప్రభుత్వం తనకు తానే విధించుకుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికతో పాటుగా అనువైన భూములను గుర్తించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్ధికంగా రుణాలను సేకరించే విషయంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మిగిలిన భూమిని కొనుగోలు చేసైనా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించుకుంది ఏపీ ప్రభుత్వం.