తమకంటే ఎమ్మెల్యే లకే ఎక్కువ విలువ.. వైసీపీ ఎంపీల ఆవేదన!!

 

ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో వైయస్ఆర్సీపి పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రాధాన్యత  తమకు ఇవ్వడం లేదని కినుకు వహించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు తమ అసహనాన్ని దాచుకోవడం లేదు, పార్టీ లైన్ దాటితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జగన్ హెచ్చరికలు జారీ చేసి మరీ పంపినప్పటికీ వైసిపి ఎంపిలు ఎవ్వరు కూడా లెక్కచేయలేదు. తెలుగు మీడియం కోసం రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ లోనే ప్రశ్నలు సంధించారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు విజయసారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంపీలు తమ అసంతృప్తిని పూర్తిస్థాయిలో బయటపెట్టారు.ఈ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మాకొట్టారు. మిగిలిన వారిలో అనేక మంది తమ తమ నియోజక వర్గాల్లో తమకు ఎదురవుతున్న పరిస్థితులను ఏకరవు పెట్టారు. 

తమకంటే ఎమ్మెల్యే లకే ఎక్కువ  విలువ లభిస్తోందనీ తమ మాటలను అసలు పట్టించుకునే వారే లేరని అలాంటప్పుడు తాము పదవిలో ఉండి ఏం ప్రయోజనమని విజయసాయిరెడ్డిపై ఎంపిలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యేలతో సమానంగా తమకూ అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పనికీ ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవడం ఏదైనా చెయ్యాలంటే వారు అడ్డుపడటం సహజంగా మారిపోయిందన్నారు. జగన్ తో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్లండంటూ విజయసాయిరెడ్డిని ఎంపీలు కోరారు.

నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా ఎంపీల మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. పదవులన్నీ ఎమ్మెల్యేలే భర్తీ చేస్తే ఇక తమకంటూ ప్రాధాన్యం ఏముంటుందని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇటీవల కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో జాతీయ స్థాయిలో జగన్ పాలన పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాల్లో జాతీయంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎంపీలకు విజయసారెడ్డి సూచించారు. టిడిపి ఎంపీలు జగన్ కు వ్యతిరేకం గా పార్లమెంట్ లో మాట్లాడితే అడ్డుకోవాలని సూచించారు. ఇతర పార్టీల ఎంపీలకు జగన్ పాలన గొప్పతనాన్ని వివరించాలని సూచించారు.