ప్రధాని ఎపి పర్యటన ఖరారు... కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం 

ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని  నిర్ణయించారు.  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఓ వైపు అధికార వైఎస్సార్‌సీపీ మరోవైపు ఎన్డీఏ కూటమి, ఇంకోవైపు కాంగ్రెస్ కూడా జనాల్లోకి వెళుతున్నాయి. మేనిఫెస్టోలు కూడా విడుదల కావడంతో.. ఆ హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధప్రదేశ్‌లో పర్యటిస్తారు. జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 7న సాయంత్రం  తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు మోదీ. వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం  అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభకు కూడా హాజరవుతారు.
మరుసటి రోజు 8న సాయంత్రం  అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7  విజయవాడలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ప్రధాని రోడ్‌షో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి రావాలని భావించారు. బిజీ షెడ్యూల్ కారణంగా మార్పులు, చేర్పులు జరిగాయని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.