జగన్ గారూ.. వారు వేటకుక్కలై వేటాడే టైం దగ్గర పడింది: రఘురామకృష్ణంరాజు

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కుక్కలతో పోల్చుతూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రిగారూ, వారంతా వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుంది' అని అన్నారు. 

 

నిరసన తెలిపే వారిని కుక్కలతో పోలుస్తారా? అని మండిపడ్డారు. మహిళలను కించపరుస్తూ పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ ఎవరో పెట్టిన పోస్టింగ్‌ను ఫార్వర్డ్ చేస్తే ఆమెపై కేసులు పెట్టినప్పుడు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అపార్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. 

 

అమరావతికి న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. రాజధాని రైతులు, మహిళలు అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే అమరావతిలో మనోధైర్య యాత్ర చేస్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

 

ఎస్వీబీసీ ఛానెల్‌లో అయోధ్య రామమందిర భూమిపూజను ప్రత్యక్షప్రసారం చేయకపోవడం దారుణమని అన్నారు. ఇక సీఎం జగన్ కు గుడికడతానన్న గోపాలపురం ఎమ్మెల్యేపై రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. అభిమానం ఉంటే మరో విధంగా చాటుకోవాలి కానీ.. గుడి కడతానని అనడం సిగ్గుచేటన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu