ఏపీ రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు: కేంద్రం
posted on Aug 6, 2020 3:56PM
మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్ కు కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని నియమించామని కేంద్రం తెలిపింది. 2015 ఏప్రిల్ 23న అప్పటి ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.