కరోనానా.. కరెన్సీ అందలేదా? వకీల్ సాబ్ కేంద్రంగా రచ్చ
posted on Apr 13, 2021 3:46PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ కోసం ఒక రోజు రోడ్ షో నిర్వహించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తర్వాత మళ్లీ ఆయన తిరుపతి వైపు చూడలేదు. ప్రచార గడువు నాలుగు రోజుల్లో ముగిస్తుంది అనగా.. పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారని జనసేన ప్రకటన విడుదల చేసింది. తన భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో.. డాక్టర్ల సూచనతో పవన్ కల్యాణ్ క్వారంటైన్ లో ఉన్నారని వెల్లడించింది.
అయితే కీలక సమయంలో పవన్ కల్యామ్ క్వారంటైన్ లోకి వెళ్లడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. క్వారంటైన్ లో ఉన్నా.. వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. కాని వకీల్ సాబ్ ఆ పని కూడా చేయలేదు. దీంతో బీజేపీకి ప్రచారం చేయడం ఇష్టం లేకే వకీల్ సాబ్.. కరోనా సాకుతో ప్రచారానికి దూరంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.
తిరుపతి లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయకపోవడంపైవైసీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పోత్తు ఉన్నా గబ్బర్ సింగ్ ఎందుకు ప్రచారం చేయడం లేదోనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కరోనా తో దూరంగా ఉన్నారా లేక.. కరెన్సీ కట్టలు అందలేదని పవన్ కల్యాణ్ అలిగారా అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే తన మిత్రుడు చంద్రబాబుకు సాయం చేయడం కోసం బీజేపీకి హ్యాండిచ్చారా అంటూ రాంబాబు కొత్త రచ్చ రాజేశారు. తిరుపతిలో ఎవరూ ప్రచారం చేసినా.. చేయకపోయినా వైసీపీ ఘన విజయాన్ని ఆపలేరన్నారు అంబటి రాంబాబు.
ఎమ్మెల్సే అంబటి వ్యాఖ్యలతో కొత్త చర్చ జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మొదటి నుంచి బీజేపీ-జనసేన మధ్య విభేదాలు వచ్చాయి. తిరుపతిలో తామే పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. 2019 ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని లెక్కేసింది. ఢిల్లీకి వెళ్లి మరి పవన్ కల్యాణ్... బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.తర్వాత ఏమైందో ఏమో పవన్ వెనక్కి తగ్గారు. పోటీపై పవన్ వెనక్కి తగ్గడంపైనా పలు రకాల చర్చలు జరిగాయి. బీజేపీపై గుర్రుగా ఉన్నందువల్లే తిరుపతిలో జనసేన పోటీ చేయలేదనే చర్చ జరిగింది. కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీలు అవగాహనతో బరిలో నిలిచాయి. వకీల్ సాబ్ సినిమా విషయంలోనూ ఏపీ సర్కార్ తీరును ఎండగట్టారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ పై వైసీపీ కక్ష కట్టిందని మండిపడ్డారు.
తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దూరంగా ఉండటమే బెటరన్న ఆలోచనకు పవన్ వచ్చారంటున్నారు. అందుకే కరోనాను సాకుగా చూపి.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది .కొన్ని రోజుల తర్వాత బీజేపీతో జనసేనాని తెగతెంపులు చేసుకుంటారని చెబుతున్నారు.