వైసీపి నేతల దౌర్జన్యాలు.. తుపాకులతో బెదిరింపులు!!

 

ఓ వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ అవినీతి రహిత పాలన అందించాలని, మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని చూస్తుంటే.. కొందరు వైసీపీ శ్రేణులు మాత్రం దౌర్జన్యాలకు పాల్పడుతూ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు.

తమ పార్టీనే అధికారంలో ఉందన్న ధీమాతో కొందరు వైసీపీ వర్గీయులు.. కాంట్రాక్టులు తమకే దక్కాలని అటు ప్రభుత్వ అధికారుల మీద, ఇటు కంపెనీ యాజమాన్యాల మీద జులుం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు తలమానికంగా ఉన్న మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కులో వైసీపీ నాయకులు బెదిరింపుల పర్వానికి తెర తీశారు. గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కును నిర్మించారు. ఇందులో నాలుగు కంపెనీలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ 350 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీలో ఏడు బ్లాక్‌లలో సోలార్‌ పలకలు ఉన్నాయి. వీటిని శుభ్రంచేసే పని కంపెనీ ప్రతినిధులు కాంట్రాక్టర్లకు అప్పగించారు.

ఈ కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని లేదా కప్పం కట్టాలని కంపెనీ ప్రతినిధులను గని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివానందరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, మంచాలకట్టకు చెందిన అనిల్‌ కుమార్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి గురువారం తుపాకులతో బెదిరించినట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులను కార్యాలయం నుంచి బయటకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారట. వీరి వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. "రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది జగన్ గారు. కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారు." అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

"మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి." అని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu