అప్పుడు అజ్ఞానవాసం.. ఇప్పుడు అజ్ఞాతవాసం!
posted on Sep 9, 2024 3:20PM
మహాభారతంలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అజ్ఞానవాసం ముగిసి ఇప్పుడు అజ్ఞాతవాసం నడుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో పైనున్న ప్రధాన నాయకుల దగ్గర్నుంచి చిట్టచివరన వున్న కార్యకర్తల వరకూ ఎవరూ విజ్ఞానంతో వ్యవహరించలేదన్న విమర్శలు వున్నాయి. మేం అధికారంలో వున్నాం, మేం ఏం చేసినా నడుస్తుంది. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. మేం చేసే పనులను కళ్ళు అప్పగించి చూడ్డం మినహా నోరు తెరచి ప్రశ్నించకూడదనే విధంగా వాళ్ళ ధోరణి వుండేది. దీనిని భరించలేక ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులు తప్పేవి కావు. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునే జైలుకు పంపిన స్థాయిలో ఆనాడు వైసీపీ నాయకుల విజ్ఞానం వర్ధిల్లింది. అలా ఐదేళ్ళపాటు కొనసాగిన వైసీపీ నాయకుల అజ్ఞానవాసం ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అజ్ఞాతవాసంగా మారింది.
ఐదేళ్ళ అధికార అంధకారంలో వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి కేసుల రూపంలో వాళ్ళనే చుట్టుకుంటున్నాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా ఎవరు చేసిన తప్పులు వాళ్ళని వెంటాడుతూ వేధిస్తున్నాయి. తప్పులు చేయడం మావంతు.. తప్పించుకుని తిరగడమూ మావంతే అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్నారు. తాము ఎక్కడున్నదీ బయటకి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్యాడ్‌లక్ ఏంటంటే, కేసులలో ఇరుక్కున్న వైసీపీ నాయకులు ఎంత అజ్ఞాతంలో వున్నా పోలీసులు కలుగులోంచి ఎలుకలను బయటకి లాగినట్టుగా లాగుతూ అరెస్టు చేస్తున్నారు. అజ్ఞాతవాసాన్ని భగ్నం చేస్తున్నారు.