తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తీసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలా నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ కేసును సుమోటోగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ నిర్ణయమే సుప్రీం అని, ఆయన అధికారాల్లోకి
కోర్టులు సాధ్యమైనంత వరకు ప్రవేశించవనే అభిప్రాయాలు వున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని హైకోర్టు ఇలా ఆదేశించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన అంశంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్
నాయకులు హైకోర్టులో కేసులు వేశారు. దీని మీద స్పందించిన హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.

పదేళ్ళ క్రితం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు, నాయకులు ఉండకూడదనే పట్టుదలతో చాలామందిని ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ ఆహ్వానించి తన పార్టీలో
చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో మిగలకుండా చేశారు. అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌కి ఫిర్యాదు చేశాయి. అయితే స్పీకర్ అధికారం పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం తమ పార్టీలోంచి ఎమ్మెల్యేలు
జారిపోయారు కాబట్టి స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా?
తనకున్న విశేష అధికారాలను హైకోర్టుకు తెలియజేస్తారా అనేది సస్పెన్స్.గా మారింది.