వైసీపీ నేత, యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
posted on Apr 27, 2021 3:25PM
ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్ కు తరలించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అతనిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
2017లో తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని... డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని... లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారం నడిపిందని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
యాంకర్ శ్యామల దంపతులు బుల్లితెరతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గానే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్లద్దరు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలతో శ్యామల దంపతులకు మంచి సంబంధాలున్నాయి. ఇటీవలే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలను కూడా కలిసి మద్దతు తెలిపారు.