నవ్వుల పాలౌతున్నా ఆగని వైసీపీ ఫేక్ ప్రచారాలు!
posted on Nov 7, 2024 9:59AM
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది వైసీపీ ధోరణి. ఆ పార్టీ సోషల్ మీడిాయా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలతో జనాలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు నవ్వులపాలై, పార్టీ పరువును నిలువునా ముంచేస్తున్నది. అయినా వైసీపీ తీరు మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. తాజాగా సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఓ వైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే, వైసీపీ సరికొత్త ఫేక్ ప్రచారం మొదలెట్టింది. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టారంటూ తన సోషల్ మీడియాలో పోస్టులు గుప్పించింది. ఒక వైపు కబినెట్ భేటీ జరుగుతుండగా పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లడమేంటి? కేంద్ర మంత్రితో భేటీ కావడమేంటి? అంటూ ప్రశ్నలు గుప్పించింది.
చంద్రబాబు హస్తిన పర్యటనపై చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారనీ, పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై, ఆయన కదలికలపై నిఘా పెట్టారనీ, ఆరాలు తీస్తున్నారంటూ తన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి కేబినెట్ భేటీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ భేటీలో తాను రాష్ట్రంలో పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్యలకు కారణాలేమిటో సవిరంగా చెప్పారు. జిల్లా ఎస్పీలకు మంత్రులు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా ఏదైనా సమస్య గురించి అడిగితే సీఐ, ఎస్ఐలే అందుకు బాధ్యులంటూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆ కారణంగానే తాను మాట్లాడాల్సి వచ్చిందని ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైసీపి తమపైనా, ప్రభుత్వంపైనా, చివరికి ఇళ్ళలో ఉండే తమ ఆడవాళ్ళపైనా కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే సంబంధిత పోలీస్ అధికారులు పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.
కేబినెట్ భేటీలో ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపి దుష్ప్రచారం గురించి, వారికి అండగా నిలుస్తున్న పోలీస్ అధికారుల గురించే మాట్లాడుతుంటే, వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టి హస్తినలో చంద్రబాబుపై అమిత్ షాకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారంటూ దుష్ప్రచారం చేసింది.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో చేస్తున్న ఫేక్ ప్రచారంపై జనం నవ్వుకుంటున్నారు. ఆ పార్టీ తీరే అంత.. ఇక మారదు అంటూ పట్టించుకోవడం మానేశారు. అయినా వైసీపీలో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఇక దిగజారడానికి ఏం మిగలలేదన్నట్లుగా దిగజారిపోయిన ఆ పార్టీ ఇంకెన్ని పతనాలను చూడాల్సి వస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.