బోరుగడ్డకు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
posted on Nov 7, 2024 9:12AM
ఓ వైపు రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో దారుణాలకు పాల్పడ్డ వారి పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా, ఇప్పటికీ రాష్ట్రంలో పోలీసు అధికారులు కొందరు వైైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు, పోలీసుల తీరు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది.
వైసీపీ సోషల్ మీడిాయా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని కడప జిల్లా పులివెందలలో అదుపులోనికి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకువచ్చి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలివేయడం, ఆ నోటీసులు అందుకు బయటకు వచ్చిన వర్రా రవీద్రరెడ్డి ఆచూకీ లేకుండా పరారైపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కడప ఎస్పీపై బదిలీ వేటు కూడా వేసింది.
అలాగే రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనీల్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన సంఘటన కూడా సంచలనం రేపింది. అలా బోరుగడ్డ అనీల్ కు రాచమర్యాదలు చేసి రెస్టారెంట్లో విందు భోజనం తినిపించిన పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసులో విచారణకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనీల్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. విచారణ పూర్తై తిరిగి జైలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్ లో భోజనాలు చేశారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఫోన్ లాక్కున్న పోలీసులు ఆ వీడియో డిలీట్ చేశారు.
అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితుడు బోరుగడ్డ అనీల్ కు పోలీసుల విందు భోజనం అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు స్పందించి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం పెట్టించిన సమయంలో విధినిర్వహణలో ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.