పవన్ కళ్యాణ్ ను కలవడానికే ఎపిలో అఘోరీ
posted on Nov 7, 2024 10:38AM
అఘోరీలు సాధారణంగా జనబాహుళ్యంలో ఉండరు.సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరవాసులకు అఘోరీ పరిచయమయ్యారు. తాను ఏడేళ్ల ప్రాయం నుంచే కాశీలోనే ఉంటున్నానని చెప్పుకున్న మంచిర్యాలకు చెందిన వివాదాస్పద అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. తెలం గాణ పోలీసులు తరిమి వేయడంతో అఘోరీ కొత్త మార్గాన్ని వెతుకున్నారు. ట్రాన్స్ జెండర్ నుంచి అఘోరీగా మారిన శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు ఎపిలో ఎంటర్ అయ్యారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని ధ్వంసం చేసినందున జనారణ్యంలో అడుగు పెట్టానని చెప్పుకున్న అఘోరీ కొద్ది రోజుల్లోనే సనాతన ధర్మం స్టాండ్ ను తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనాతన ధర్మం పరిరక్షించడం లేదని అఘోరీ ఆరోపిస్తుంది.ముఖ్యమంత్రి పదవి ఊడగొడతానని ఢాంబికాలు చెప్పుకున్న అఘోరీ ఎపిలో ప్రవేశించడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బోనాల పండుగ సందర్బంగా రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పే వారిని అత్యత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. రంగంలో రాజకీయాలు, ఆర్థికపర విషయాలను జోస్యం చెబుతారు. కానీ అఘోరీ విషయంలో తెలంగాణ ప్రజలు పెద్దగా ఓన్ చేసుకోలేదని తెలుస్తోంది. ముత్యాలమ్మ గుడి వివాదం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ అఘోరీని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ హిందుత్వ వాదులు ఆమెను పట్టించుకోలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దగా స్పందించలేదు. దీంతో అఘోరీ గత నెలలో కేదార్ నాథ్ బయలు దేరి వెళ్లారు. నవంబర్ ఒకటో తేదీన సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పిన అఘోరీ తెలంగాణ పోలీసులను ముచ్చెమటలు పట్టించారు. తన కారులో పెట్రోల్ క్యాన్ లతో అఘోరీ కనిపించడంతో అరెస్ట్ చేసి మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాంకిడిలో వదిలేసారు. అఘోరీ నాగ్ పూర్ హైవే మీదుగా కేదార్ నాథ్ వెళతారని పలువురు ఊహించారు. కానీ ఆమె అనూహ్యంగా ఎపి బాట పట్టారు. ఎపిలోని అనేక శై వ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అఘోరీ రోజు రోజుకు తన అటైర్ మార్చేసుకుంటున్నారు. తెలంగాణలో నగ్నంగా విభూతితో కనిపించిన అఘోరీ ఎపిలో మాత్రం అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. చేతిలో త్రిశూలం, కమండలంతో కనిపిస్తున్నారు. అఘెరీని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.సనాతన ధర్మం కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. గోమాతను రక్షించుకుందాం అని ఆమె పదే పదే అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సనాతన ధర్మ ప్రచారం చేయాలని అఘోరీ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్యమిస్తున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు కలవడానికి ఆమె ఎపికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అఘోరీకి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక ప్రజా సంఘాలు అఘోరీ ని వ్యతిరేకించాయి. కొన్ని యూట్యూబ్ చానెల్స్ అఘోరీకి హైప్ తీసుకొచ్చాయి. వ్యూస్ కోసమే అఘోరీ వెంట పడ్డారన్న అపవాదు సోషల్ మీడియా మూఠ గట్టుకుంది. తెలంగాణ నుంచి తరిమివేయబడ్డ అఘోరీ మహరాష్ట్ర నుంచి సరాసరి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించారు. సనాతన ధర్మ పరిరక్షణకు కమిటీ వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తిరుమలలో కల్తీ లడ్డు వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షచేపట్టిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తరచూ మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ అఘోరీని ఎంటర్ టైన్ చేయకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. అఘోరీ వెనక కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపార ప్రయోజనాల కోసమే తెరమీదరకు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అఘోరీ మెయిన్ టైన్ చేసే విలువైన ఐ ఫోన్లు, ఐ 20 కారు అంతా వారే చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.