ప్రచారవ్యూహం లేక వైసీపీ మల్లగుల్లాలు.. జగన్ చేతులెత్తేశారా?

ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో  ఒక స్పష్టత ఉంటుంది. అధికారంలో ఉన్న కాలంలో చేసిన అభివృద్ధీ, ప్రజలకు అందించిన సంక్షేమం వివరించి ఓట్లు అడగడానికి వెసులుబాటు ఉంటుంది. అయితే వాస్తవంగా అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధి సంక్షేమాలపై ప్రభుత్వం ప్రజలమెప్పు పొందిందా లేదా అన్నది ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు. అది వేరే సంగతి.

కానీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునే విషయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ విపక్షం కంటే ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అలాగే అసమ్మతి బెడదా తక్కువ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీలో గాభరా కనిపిస్తోంది. ఓటమి తప్పదన్న బెదురు కానవస్తోంది. అదే సమయంలో విపక్షంలో ధీమా కనిపిస్తోంది. జనం మావైపే ఉన్నారన్న భరోసా కానవస్తోంది. ఇందుకు కారణాల గురించి చెప్పుకునే ముందు విపక్షంగా తెలుగుదేశం ఓంటరిగా పోరు చేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగింది. అలాంటి సమయంలో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, ఆ సర్దుబాటు కారణంగా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడటం, అందు వల్ల ఆశించిన సీటు దక్కక నేతల్లో పెచ్చరిల్లే అసంతృప్తి ఇన్నిటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఇబ్బందులు, ఇరకాటాలన్నిటినీ అలవోకగా దాటేసింది.

అదే సమయంలో అధికారంలో ఉండటం చేత ఉన్న సానుకూలాలన్నిటినీ వైసీపీ చేజేతులా ప్రతికూలంగా మార్చేసుకుంది.  అందుకే  ఏపీలో  జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని, సీట్ల సర్దుబాటు చేసుకుని, ఆ కారణంగా పార్టీలో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి పార్టీలో అసంతృప్తి అనవాలే లేకుండా చేసుకుని ధీమాగా కనిపిస్తుంటే.. అధికార వైసీపీలో  మాత్రం ఆందోళన, గందర గోళం కనిపిస్తోంది.  పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చేసుకోలేని పరిస్థితి కానవస్తోంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు సైతం జనం స్పందన కానరాక పార్టీలో  ఓటమి భయం కనిపిస్తోంది.  ఏపీలో పోలింగ్ తేదీ మే 13. అంటే మరో 17 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ వైసీపీ ప్రచారం జోరందుకోలేదు. విరామాలతో సాగిన జగన్ బస్సు యాత్ర తప్ప అధికార పార్టీ ప్రచారం జోరు పెంచింది లేదు.

మరో వైపు తెలుగుదేశం కూటమి మాత్రం ప్రచారం జోరు పెంచింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు ఉమ్మడి ప్రచారంతో పాటుగా ఎవరికి వారుగా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వారి ఎన్నికల ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.  అధికార వైసీపీ మాత్రం ప్రచార వ్యూహం లేక మల్లగుల్లాలు పడుతోంది. పరిస్థితి చూస్తుంటే అధికార పార్టీ అధినేతలో గెలుపు ధీమా కాగడాపెట్టి వెతికినా కూడా కనిపించడం లేదని పరిశీలకలుు విశ్లేషిస్తున్నారు. ఫలితం  తెలిసిపోయిన తరువాత ఇంక చేసేదేముంది అని చేతులెత్తేసినట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు.