ఆంధ్రావని అగ్రపీఠం తెలుగుదేశం కూటమిదే.. సంబరాలకు సిద్ధమైన శ్రేణులు
posted on Jun 3, 2024 12:46AM
ఐదేళ్ల కష్టం కళ్లముందే కదలాడుతోంది.. అడుగడుగునా ఇబ్బందులు.. సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు సహజవనరులు దోచుకోవడంపైనే దృష్టిపెట్టారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు . ప్రజలకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలను చిత్రహింసలకు గురిచేశారు. అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. బాధలు, అవమానాలు, కష్టాలు దిగమింగుకొని. నోరు మెదపకుండా ఐదేళ్లు మౌనంగా ఉన్న ఏపీ ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. మరికొద్ది గంటల తరువాత ప్రజా తీర్పు వెలువడనుంది. ప్రజా ప్రభుత్వం గద్దెనెక్కనుంది. రాక్షసపాలనకు స్వస్తిపలికి సరికొత్తగా ఉదయించే సూర్యుడిలా చంద్రన్న కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూటమి విజయం ఖాయం కావడంతో ఏపీ మొత్తం ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో వెలువడనున్న ఫలితాల్లో కూటమి విజయం లాంఛనం కానుండటంతో టపాలసు మోతతో ఏపీ రాజధాని అమరావతి అని చాటిచెప్పేందుకు ప్రజావాణి సిద్ధమైంది.
మే13న ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఐదేళ్ల జగన్ పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమికి అధకారం కట్టబెట్టేందుకు డిసైడైపోయారు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో దాదాపు 82శాతం ఓటింగ్ నమోదైంది. ఈవీఎంలలో ఓటర్లు తీర్పు నిక్షిప్తమైంది. పోలింగ్ రోజు, తరువాత ఓటర్ల నాడిని అవపోసన పట్టిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూటమి అధికారం పక్కా అని తేలిపోయింది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోని 90శాతం సర్వే సంస్థలు కూటమి విజయం పక్కా అని కుండబద్దలు కొట్టేశాయి. అధికారం కూటమిదే అని స్పష్టతవచ్చేసింది.
మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు తరువాత ఫలితం అధికారికంగా వెలువడ నుంచి. ఇందు కోసం ఏపీ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కూటమి విజయదుందుభితో ఏపీ మొత్తం సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చేందుకు ప్రపంచ దేశాల మేధావులు మెచ్చిన, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన, హైటెక్ సిటీ సృష్టికర్త అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.