బలం లేకున్నా నామినేషన్లు వేశారు.. బహిష్కరణ అంటూ డ్రామాలాడుతున్నారు!
posted on Nov 22, 2024 2:19PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పీఏసీ కమిటీ సభ్యుల ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది. సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకోవాలన్న కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహించిందని విమర్శలు గుప్పించింది. అయితే వాస్తవానికి ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమన్నది లాంఛనం మాత్రమే. అ లాంఛనాన్ని పాటించాలన్నా సభలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ ఉండాల్సి ఉంటుంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం అయినా, లాంఛనం మేరకు అయినా వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఆ పార్టీ పీఏసీ కోసం తగుదునమ్మా అంటూ పుంగనూరు పుడింగి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించింది.
పీఏసీలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి 9 నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుత సభలో సంఖ్యాబలం మేరకు వారంతా ఎన్నిక కావడం ఖాయం. అయితే వైసీపీ నుంచి దాఖలైన మూడు నామినేషన్లలో ఒక అభ్యర్ధి మాత్రం గెలిచే అవకాశముంది. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ ఎన్నికల్ని బహిష్కరించింది.
ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు వరకూ సాగింది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటమి ఎటూ తప్పదని ముందే తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అసలు తమ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓటు వేయడానికి వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి రాలేదు. వైసీపీ ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఆయన బెంగళూరు చెక్కేశారు. అంటే ఏదో ఒక అయోమయం సృష్టించి ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించడం లేదు అన్న విమర్శ చేయడం కోసమే పెద్దిరెడ్డిచేత జగన్ నామినేషన్ వేయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పీఏసీ చైర్మన్ గా వైసీపీకి నిజంగా అవకాశం ఉంటే.. క్యాబినెట్ ర్యాంక్ కోసం జగనే స్వయంగా నామినేషన్ వేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు.
అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు నామినేషన్లు దాఖలు చేశారో ఆ పార్టీకే తెలియాలి. ఎన్నిక పూర్తయ్యింది. ఇక ఫలితాల ప్రకటనే తరువాయి. పీఏసీ చైర్మన్ గా పులపర్తి ఆంజనేయులు (జనసేన), అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ), పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ (టీడీపీ) ఎన్నిక కానున్నారు.