ఆసీస్- భారత్ తొలి టెస్టు తొలి రోజు వికెట్లు టపటపా
posted on Nov 22, 2024 3:20PM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బ్యాటర్ల తడబ్యాటు ఆశ్చర్యం కలిగించకపోయినా, టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు కూడా చేతులెత్తేయడమే విశేషం.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా ఆసీస్ పేసర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసిస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ గరిష్టంగా నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. ఈ టెస్టుతో టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం. టీమ్ ఇండియా ఓపెనర్ యశశ్వి జైశ్వాల్, దేవదత్ పడిక్కల్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓపికగా ఆడి 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ 11 , వాషింగ్టన్ సుందర్ నాలుగు, అవుటయ్యారు. పంత్ 37 కూడా మంచి ఆరంభాలను మంచి స్కోర్లుగా మాలచడంలో విఫలమయ్యారు.
ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ బ్యాటర్లు టీమ్ ఇండియా పేసర్లు బుమ్రా, సిరాజ్ ల ధాటికి పెవిలియన్ కు క్యూకట్టారు. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆటముగిసే సరికి అలెక్స్ కేరీ 19 పరుగులతోనూ, మైకేల్ స్టార్క్ 6 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తం మీద తొలి రోజు 17 వికెట్లు పతనమయ్యాయి. పేసర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్ పై తొలి రోజు ఆటలో నిస్సందేహంగా టీమ్ ఇండియా పై చేయి సాధించింది.