వినతి పత్రంతీసుకోవాలంటే అధికారులు సీటులో కూర్చోవద్దా?

చింత చచ్చినా పులుపు చావలేదంటారు… అలాగే ఉంది తిరుపతిలో వైసీపీ నాయకుల ధోరణి… అధికారులపై వైసీపీ నాయకుల పెత్తనం ఇంకా తగ్గడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న విధంగానే ఇంకా అయ్యా సార్ అనేలాగే అధికారులు ఉండాలనే ఆశిస్తున్నారు.  కాదు… కాదు ఆదేశిస్తున్నారు.  ఓవైపు అధినేత జగన్ ఉన్నతాధికారులను హెచ్చరిస్తుంటే.. మరోవైపు జిల్లా స్థాయి నాయకులు కిందిస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

వైసీపీ  రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రచారం చేయడానికి ఓ కొత్త అంశంతో తెర పైకి వచ్చింది. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు  వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఇంఛార్జ్ రాజేష్, మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశి సహా వైసీపీ నాయకులు తరలి వచ్చారు. 

కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు నేరుగా డీఆర్వో దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే ఇతరుల నుంచి అర్జీలు తీసుకుంటున్న డీఆర్వో వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు హడావుడితో అర్జీదారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్జీ పత్రాన్ని భూమన కరుణాకర్ రెడ్డి డీఆర్వోకు ఇవ్వడానికి సిద్దం కాగా.. డీఆర్వో నరసింహులు తన సీటులో కూర్చోని చేయి చాచారు. దీంతో  వైసీపీ నాయకులు డీఆర్వోపై ఆగ్రహిస్తూ.. సీటులో నుంచి లేచి వినతి పత్రం తీసుకోవాలని  హూంకరించారు . తొలుత లేచి వినతి పత్రం తీసుకోవడానికి ఇష్టపడని డీఆర్వో, మరోసారి వైసీపీ నాయకులు గద్దించడంతో సీటులంచి లేచి నిలబడి తీసుకున్నారు. అయితే వైసీపీయుల దాష్టీకం, అహంభావం జనానికి ఇసుమంతైనా నచ్చలేదు.   అక్కడ ఉన్న ప్రజలు మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదనే సామెతను తలుచుకుంటూ అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని వ్యాఖ్యానించడమే ఇందుకు తార్కానం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu