హస్తిన బాట పట్టిన తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయనేతలంతా ఢీల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సమాయత్తమై ఏకంగా ప్రత్యేక రైలులో హస్తిన వెడితే... ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక  నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు హస్తిన బయలుదేరారు. మొత్తం మీద ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడిందని చెప్పాల్సి ఉంటుంది. 

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశం తెరమీదకు రావడానికి ముందు వరకూ కూడా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ లో  జోష్ నింపగా, బీఆర్ఎస్ ను బెంబేలెత్తిస్తోంది. అయితే కేవలం కాళేశ్వరం కారణంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరుగున పడేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. కాళేశ్వరం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్ట్ కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంతిని బీఆర్ఎస్ కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చలో పాల్గొనేదీ, లేనిదీ నిర్ణయించుకోవలసింది బీఆర్ఎస్, కేసీఆర్ లే.  దీంతో కాంగ్రెస్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం మేరకు  హస్తినపై దృష్టి పెట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు బుధవారం (ఆగస్టు 6) హస్తినలో జంతర్ మంతర్ వద్ద జరగనున్న భారీ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలంతా పాల్గొంటున్నారు.  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రయోగించిన బీసీ రిజర్వేషన్ అస్త్రం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకూ ఒక ఆయుధంగా మారింది.

రిజర్వేషన్ల కోసం పోరాడిని పార్టీగా పేరు తెచ్చుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ పోటీలు పడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ తో విభేదించి సొంత మార్గంలో నడుస్తున్న కల్వకుంట్ల కవిత సైతం బీసీ పోరులో నేనున్నానంటూ హడావుడి చేస్తున్నారు.   ఆఖరికి కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ సైతం హస్తిన వేదికగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీరుకు, వైఖరికి నిరసనగా హస్తినలో  గత శనివారం నిరసన కార్యక్రమం చేపట్టింది.    

దిల్లీ జంతర్‌మంతర్‌ ‌వద్ద ఈనెల 6న బిసీ వర్గాలతో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించింది. ఈ ధర్నాకు తెలంగాణలోని ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం పాతిక మందికి తక్కువకాకుండా సమీకరించి  సోమవారం (ఆగస్టు 4) ప్రత్యేక రైల్‌లో దిల్లీ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్. జంతర్ మంతర్ ధర్నా కంటే ముందు పార్లముంటులో బీసీ రిజర్వేషన్లపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్ట ముందు ఈ నెల 5న పార్లమెంటులో బిసీ బిల్లుపై చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తోంది. చివరగా ఆగస్ట్ 7న అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆయోదించిన బిసీ బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించనుంది.  మొత్తంమీద బిసీ రిజర్వేషన్‌ ‌బిల్లు ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలను పరుగులు పెట్టిస్తున్నది. త్వరలో రానున్న స్థానిక ఎన్నికలు ఈ రిజర్వేషన్‌లతో ముడివడి ఉండడంతో పార్టీలకు ఆ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu