పుతిన్ దయాదాక్షిణ్యాలపై మానవాళి మనుగడ!
posted on Nov 21, 2024 2:09PM
రష్యా నిర్ణయంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన క్షణం నుంచీ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన అణ్వాయుధం రష్యా వద్ద ఉంది. కేవలం ఒక్క మీట నొక్కితే చాలు ప్రపంచాన్ని అంతం చేసేంత శక్తిమంతమైన అణ్వాయుధాన్ని చేతిలో ఉంచుకున్న రష్యా ఇప్పుడు దానిని ఉపయోగించడానికి రెడీ అయిపోయింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో గెలుపు, ఓటమి లేకుండా తీవ్రంగా నష్టపోతున్న రష్యా అసలే ఉక్రోషంలో ఉంది. సరిగ్గా అటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాజకీయ తంత్రమో, కుతంత్రమో తెలియదు కానీ అనాలోచితంగా తాము సరఫరా చేసిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపైకి ప్రయోగించడానికి అనుమతి ఇచ్చేశారు. ఇలా అనుమతి వచ్చిందో లేదో అలా ఉక్రెయిన్ అమెరికా క్షిపణిని రష్యాకు గురిపెట్టింది. బైడెన్ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్.. గతంలో హెచ్చించిన విధంగా అణ్వాయుధాల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అసలు సోవియెట్ యూనియన్ కాలం నుంచీ కూడా రష్యాది దుందుడుకు వ్యవహారమే. ఏక థృవ ప్రపంచాన్ని రష్యా సవాల్ చేస్తూనే వస్తోంది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా రష్యా వ్యూహాత్మకంగా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూనే ఉంది. ఇందుకు చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల మద్దతును కూడగట్టుకుంది.
1990 పూర్వం సోవియట్,అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచేది. అప్పుడు ప్రపంచంలోని దేశాలు రెండు వర్గాలుగా విడిపోయాయి.కొన్ని తటస్థ దేశాలు అలీన విధానం అవలంబించి నా ఆ ఆ అలీన విధానం ప్రాధాన్యత ప్రాభవం కల్పోయింది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నంతో అమెరికా అటోమేటిక్ గా అగ్రరాజ్యంగా, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా తనకు తాను ప్రకటించేసుకుని ఎదురులేని శక్తిగా మారింది. అయితే రష్యా అధ్యక్ష పగ్గాలు పుతిన్ చేతికి వచ్చిన తరువాత పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. అమెరికా,నాటో దేశాలతో ఢీకొనడానికి అవసరమైన శక్తియుక్తులను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను రష్యాపై ప్రయోగించడంతో నిశ్శబ్దం ఒక్కరానిగా బద్దలైపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ కంటే అమెరికాయే టార్గెట్ అని రష్యా అధ్యక్షుడి ప్రకటనలు రూఢీ చేస్తున్నాయి. దీంతో అమెరికా ఎప్పుడు, ఏ రూపంలో దాడులకు జరుగుతాయోనన్న భయంతో వణికిపోతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత రష్యా విషయంలో అమెరికా ఈ స్థాయిలో భయపడటం ిదే తొలిసారని చెప్పవచ్చు. రష్యా వద్ద 5500 నూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే, అమెరికా వద్ద 5,044 మాత్రమే ఉన్నాయి. .ఉక్రెయిన్ రష్యాపై మరిన్ని దాడులకు పాల్పడితే రష్యా నిస్సందేహంగా అమెరికాపై అణుదాడులకు పాల్పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా నాటో దేశాలపై కూడా దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఇదే జరిగితే ప్రపంచానికి ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అమెరికాలో అధికారమార్పిడి జరిగి మరో రెండు నెలల వ్యవధిలో బైడన్ స్థానంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు అంత వరకూ పుతిన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించగలరన్న నమ్మకాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ట్రంప్ ఎన్నికల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ చేసిన వాగ్దానం ప్రధాన కారణం. పుతిన్, ట్రంప్ ల మధ్య అనుబంధం తెలియనిది కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపనుండడమే ఉక్రెయిన్ అధ్యక్షుడి దూకుడుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ జోక్యంతో యుద్ధం ఆగినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలనెస్కీ మాత్రం సేఫ్ కాదని అంటున్నారు. అందుకే ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి ముందే పుతిన్ తో లెక్కలు తేల్చేసుకోవాలని జెలనెస్కీతొందరపడుతున్నారు. ఇదే పుతిన్ ను అణ్యాస్త్రాల ప్రయోగం దిశగా రెచ్చగొడుతున్నది. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే పుతిన్ దయాదాక్షిణ్యాల మీదే ప్రపంచ దేశాల, మానవాళి మనుగడ ఆధారపడి ఉందని చెప్పడానకి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.