నటి కస్తూరికి బెయిలు

తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు అరెస్టైన నటి కస్తూరికి బెయిలు మంజూరైంది. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ సభలో నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేసిన సంగతి తెలిసిందే. అధికార డీఎంకేను టార్గెట్ చేస్తూ ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులోని తెలుగు సంఘాలు ఆమెపై ఫిర్యాదులు చేశాయి.

తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కస్తూరి బేషరతుగా క్షమాపణ చెప్పి నష్టనివారణ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమెపై ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అజ్ణాతంలో ఉంటూనే ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆమెకు కోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తరువాత తమిళనాడు పోలీసులు ఆమెను హైదరాబాద్ లో అరెస్టు చేసి చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఆయన ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.   తాజాగా ఆమె దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.