కిడ్నీలు పదిలం సుమా (world kidney day)

 

మన శరీరంలో కొన్ని చిన్న అవయవాలలాగా కనిపిస్తాయే గాని వాటి పని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మన కిడ్నీల లాగా. అవి చూడటానికి చిన్న చిక్కుడు గింజల్లాగా కనిపిస్తాయి. వాటి  పరిమాణం కేవలం 4.5 అంగుళాలు ఇంకా బరువు నలుగు నుంచి ఆరు ఔన్సులు మాత్రమే ఉంటుంది. కాని మన ఆరోగ్యం పట్ల తీసుకునే శ్రద్ద మాత్రం అంతా ఇంతా కాదట. మీకో నిజం తెలుసా గుండెల్లో కన్నా, మన మెదడులో కన్నా రక్తప్రసరణ వేగంగా జరిగేది మన మూత్రపిండాల్లోనేనట. ప్రతి అరగంటకి కిడ్నీలు మన శరీరంలోని రక్తాన్ని మొత్తం శుద్ధి చేసి రక్తంలోని టాక్సిన్స్ ని తొలగిస్తాయట. ప్రతి ఏడాది మార్చ్ 10న మనం వరల్డ్ కిడ్నీ డే ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది థీమ్ Kidney disease&children -Act early to prevent it. చిన్న పిల్లల్లో వచ్చే కిడ్నీలకి సంభందించిన వ్యాధిని కనిపెట్టటమే కాదు దాని నియంత్రణ కూడా త్వరితగతిన చేపట్టాలని దీని సారాంశం.

 

ఈ రోజుల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే మాట తరచుగా వింటూనే ఉన్నాం. కిడ్నీలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నా మన ఆహారపు అలవాట్ల వల్ల, కాలుష్యం వల్ల, హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్ వంటి వ్యాధుల వల్ల వాటి పనితీరు దెబ్బ తిని ప్రాణాల  మీదకి తెస్తోంది. ఇది పెద్దవారిలో మాత్రమే కాదు చిన్నపిల్లలలో కూడా ఎక్కువగా రావటం గమనించాల్సిన విషయం. ఈ సమస్య గురించి కాస్త సమయం వెచ్చించి కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు కిడ్నీలు  పదిలంగా ఉంటూ మనని పదిలంగా ఉంచుతాయి.

 

 

కిడ్నీల పనితీరు బాగుండాలంటే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.


వీటికి బలాన్నిచ్చే ఆహారం  అంటే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, ఆపిల్, కాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.


నొప్పులు వస్తే వాడే ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటి మాత్రలు వాడటం పూర్తిగా తగ్గించుకోవాలి. ఇవి కిడ్నీల మీద తమ దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.


కాఫీ, టీలను కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా నియంత్రించుకోవాలి.


రాత్రిళ్ళు మరీ ఆలస్యం కాకుండా భోజనం చెయ్యాలి. దీనివల్ల కిడ్నీల పనితీరు బాగుంటుంది.
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఎక్కువ శాతం సాల్మన్ చేపని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.


గుడ్డులోని తెల్ల సొన కిడ్నీలకి మంచిదని చెపుతున్నారు వైద్యులు.


అలాగే హై ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని కూడా నియంత్రించుకోవాలట.


ఆహారంలో ఎక్కువ శాతం ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది.


ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్న మంచిదట.
గ్రీన్ జ్యూస్ లని ఎక్కువగా తాగితే మంచిది.

 

మన ఆరోగ్యానికి అన్ని విధాలా దోహద పడే కిడ్నీల పట్ల మనం చూపించే కొద్దిపాటి జాగ్రత్త చాలు, అవి ఆరోగ్యంగా ఉండి  మనని చిరంజీవులుగా ఉంచటానికి.

...కళ్యాణి