హ్యాట్సాఫ్ మేడం కానిస్టేబుల్!
posted on Apr 7, 2023 10:05AM
టెన్త్ పరీక్షా కేందంలోకి మొబైల్ ఫోన్ తో వెళుతున్న రాచకొండ సీపీని ఓ మహిళా కానిస్టేబుల్ ఆపేసిన ఘటన తోటి పోలీసు అధికారులనే కాదు, సామాన్య ప్రజలను సైతం దిగ్భ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కల్పన రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్ డీఎస్ చౌహాన్ కు ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రంలో అడుగు పెట్టకుండా నిలిపివేశారు. అందుకు కారణం ఆయన వద్ద మొబైల్ ఫోన్ ఉండటమే. దీంతో సీపీయే కాకుండా అక్కడ ఉన్న పోలీసు అధికారులూ షాక్ అయ్యారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు చౌహాన్ టెన్త్ పరీక్షా కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ కానిస్టేబుల్ చర్యను ఇతర పోలీసు అధికారులు దిగ్భ్రాంతితో చూస్తుండగా, చౌహాన్ ఆమెను చూసి చిరునవ్వుతో మొబైల్ ఫోన్ ఇచ్చి, పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. అనంతరం చౌహాన్ ఆ మహిళా కానిస్టేబుల్‌ను అభినందించి, రూ. 500 నగదు బహుమతిని అందజేశారు.
పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిజాయితీగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ కోరారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వ్యక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సెంటర్‌లోకి మొబైల్ ఫోన్‌లను అనుమతించవద్దని ఆయన పోలీసులను కోరారు. ప్రతి పోలీస్ ఇలానే తమ విధులను భయం, పక్షపాతం లేకుండా క్రమశిక్షణతో నిర్వహిస్తే ఎంత బాగుండును అని జనం అంటున్నారు. ఏకంగా సీపీనే ఆపేసి మొబైల్ ఫోన్ తీసుకున్న తరువాత టెన్త్ పరీక్షా కేంద్రంలోనికి అనుమతించిన మహిళా కానిస్టేబుల్ కల్పనకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.