కర్నాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. కానీ
posted on Apr 7, 2023 9:54AM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నెలరోజులు కుడా సమయం లేదు. మే 10 పోలింగ్, మే 13 కౌంటింగ్ పూర్తవుతాయి. నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైన ఎన్నికలుగా చూసేందుకు లేదు. ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రానికి కర్ణాటక ఎన్నికలు ‘ట్రైలర్’ అనవచ్చునని పరిశీలకులు అంటున్నారు.
ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావో రేవో అన్న రీతిలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా, ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత సమీకరణలు చకచకా మారిపోయాయి. బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో తృతీయ శక్తిగా చక్రం తిప్పే జేడీఎస్ కూడా చప్పబడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి భరోసాతో ముందుకు సాగుతోంది. నిజానికి కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అందరికంటే ముందు సగానికి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం 124 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో 42 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం 224 స్తలకు గానూ, 166 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
అయితే మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో నేను ఉన్నాను..నేను ఉన్నాను ..అని ఒకటికి రెండుసార్లు బహిరంగంగా ప్రకటించుకున్న, సిద్ద్రరామయ్యకు ఆయన కోరుకున్నా కోలార్ నియోజక వర్గం టికెట్ దక్కలేదు.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మరో ముఖ్యమంత్రి పోటీదారు డీకే శివకుమార్ పోటీ చేసే నియోజకవర్గాల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు వరుణ సీటు కేటాయించింది. అయితే వరుణ కంటే కూడా కోలార్ లో ఈసారి పోటీ చేయాలని సిద్ధూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తప్పలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కూల్ గా ఉన్నా, ఆఖరి క్షణంలో ఏమి చేస్తారనేది చెప్పలేమని, పార్టీ కేటాయించిన వరుణ నియోజక వర్గంతో పాటు తాను కోరుకున్న కోలార్ నియోజక వర్గంలో పోటీ చేసందుకు అంగీకరించక పోతే, సిద్దూ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. అలాగే సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించేందుకే ఆయన్ని ఓడిపోయే నియోజక వర్గం నుంచి బరిలో దించుతున్నారా అనే అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూ అసంతృప్తి వ్యక్త పరిచినా, అలక పూని ఎన్నికలకు దూరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కష్టమే అంటున్నారు.
అలాగే కర్ణాటక నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలని భావించిన బీఆర్ఎస్ కూడా ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. పార్టీ పేరున పోటీ చేసి ఓడి పొతే, ఆ ప్రభావం ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, అటు లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన ఫోకస్ మహారాష్ట్ర వైపు తిప్పారని, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.
అయితే తెలంగాణ భవన్ లో మరో మాట కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతల ‘లీకు’ ల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్... నేతలు కొందరు రాష్ట్ర సరిహద్దు నియోజక వర్గాలలో పర్యటించి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలలోని టికెట్ రాని అసంతృప్తులను చేరే దీసి, గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరే షరతుపై ఆర్థిక సహయం అందించే అలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కేసీఆర్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్పలేమని, బీఆర్ఎస్ నేతలు చెపుతున్నాయి.