బడ్జెట్ కు వేళయ్యింది.. రాష్ట్రపతిని కలిసిన నిర్మలాసీతారామన్

బడ్జెట్ కు వేళయ్యింది. దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం భారత దేశం బడ్జెట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనం గుప్పిట చిక్కి విలవిలలాడుతున్న తరుణంగా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఒకింత మెరుగ్గా ఉందన్న ఐఎమ్ఎఫ్ అంచనాల నేపథ్యంలో ప్రపంచం దృష్టి భారత్ వైపు మళ్లింది.

ఈ సమయంలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆమె కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టడం వరుసగా ఇది ఆరోసారి. కాగా ఆనవాయితీ ప్రకారం ఆమె కొద్ది సేపటి కిందట రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కు ఆమోదం పొందారు. ఆ వెంటనే కేంద్ర కేబినెట్ తో భేటీ అయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ నిర్మలమ్మ పద్దును ఆమోదించింది. మరి కొద్ది సేపటిలో ఆమె పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెడతారు.  

ఇక, 2023-24 బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో నిర్మలా సీతారామన్  వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత ఆర్థికమంత్రుల జాబితాలో  ఆరో స్థానంలో నిలిచారు. గతంలో   మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, యశ్వంత్ సిన్హా, చిదంబరం, అరుణ్ జైట్లీలు వరుసగా ఐదు సార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.