రాహుల్ వినతిని మోడీ మన్నిస్తారా?
posted on Apr 29, 2025 2:12PM
.webp)
జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని ఆ లేఖలో రాహుల్ కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంటు సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు.
పహల్గామ్ దాడి జరిగిన వెంటనే తర్వాతి రోజు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జరిగిన అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేత లు హాజరయ్యారు. ఆ సమావేశంలో భారత ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ మద్దతుగా ఉంటామని, వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు.
అయితే ఆ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరుకాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ప్రధాని మోడీ వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను వివరించి ఉంటే బాగుండేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఖర్గే, రాహుల్ రాసిన లేఖపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.