ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు
posted on Apr 29, 2025 1:20PM
.webp)
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక అరాచకత్వం, కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా నేరాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే నేరాలకు పాల్పడి జగన్ అండ చూసుకుని అక్రమాలు, అవకతవకలకు తెగడిన సంఘటనలు నివ్వెర పరుస్తున్నాయి. అటువంటి వారిలో జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులు ముందు వరుసలో నిలుస్తున్నారు.
ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఆయన ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకణలో అవకతవకలు జరిగాయనీ, ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు హయాంలో జరిగిన అవకతవకలపై అందిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో పీఎస్ఆర్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో తాజాగా మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.