బంధాలు బలపడే మార్గాలివిగో...

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి.

భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు మొదటి రూల్... మనసుకు కష్టం కలిగించిన వెంటనే ఆ విషయాన్ని భాగస్వామితో చర్చించాలి. నెమ్మదిగా చెప్పాలి. అలా కాకుండా ఆ బాధను దిగమింగితే అది మనసులోనే పెరిగి, పెద్దదై, చీడపురుగులా మారి ప్రేమవృక్షాన్ని తొలిచేయడం మొదలుపెడుతుంది. అలా అని ప్రతీ నిమిషం నాకిది నచ్చలేదు, నువ్వు ఇలా చేశావు అంటూ ఆరోపణలు గుప్పించటం కాదు. బాధ కలిగింది అన్న విషయాన్ని కమ్యునికేట్ చేయటమే లక్ష్యం తప్ప ఎదుటి వ్యక్తి పొరపాట్లని ఎంచటం ఉద్దేశం కాకూడదు.

అలాగే... ఏం చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని ఊహించుకుని భయపడటం కూడా మంచిది కాదు.ఇతరుల మెదడులోకి చూడటం మాని మనం ఏం అనుకుంటున్నామో అవి చెప్పాలి. ఎందుకంటే అపోహతో ఎదుటి వ్యక్తిని దూరం చేసుకునే బదులు బాధను పంచుకుని దగ్గర చేసుకోవటం వివేకమనిపించుకుంటుంది.

నూరేళ్ళ జీవితంలో ‘ప్రేమ’ పచ్చగా కళకళలాడుతూ మనల్ని అంటిపెట్టుకుని వుండాలంటే మనం పాటించాల్సిన మరో సూత్రం.... తెలిసీ తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, మాట తూలినా, ఎదుటి వ్యక్తి మనసు కష్టపెట్టినా ఆ పొరపాటుల్ని అంగీకరించాలి. జరిగిన పొరపాటుని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని పొందగలం. అలాగే మన ఆత్మవిశ్వాసం నిలుపుకోగలం. పొరపాటు అంగీకరించినట్లు ఎదుటివారు గుర్తించినప్పుడు మాత్రమే వారూ ఓ అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఏ కంటికి బాధకలిగినా రెండు కళ్ళూ కన్నీటితో నిండుతాయి. ఇద్దరిలో బాధ ఎవరికి కలిగినా రెండు మనసులూ మూగబోతాయి.

ఇక మూడో సూత్రం... చాలా సరదాగా మొదలైన చర్చ తీవ్రరూపం దాలుస్తుంటే దానిని అక్కడితో ఆపేయడం మంచింది. ఎవరికి వారు వేరే పనిలో కాసేపు దృష్టిపెట్టి, ఆవేశం చల్లారాక మాట్లాడటానికి ప్రయత్నించాలి. అందుకు కొంత సమయం పట్టినా పర్వాలేదు. తొందరపాటుతో బంధాన్ని బలహీనపరచుకోవటం కన్నా ఓపికపట్టడం తప్పుకాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకు తీరాలి. ఏ సమస్యకి అయినా సరైన వాతావరణంలో ప్రశాంతంగా చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది.

ఇక నాలుగో సూత్రం... ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం. వినటమంటే చెవులతో కాదు... మనసుతో వినటం ముఖ్యం. తను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకోగలగాలి. అయితే... కానీ లాంటి కారణాలు వెతకద్దు. అలాగే తన ఆలోచన తప్పనిపిస్తే దానిని కూడా స్పష్టంగా, నెమ్మదిగా చెప్పాలి. అంతేకాని, అప్పటికి ఆ విషయాన్ని ముగించాలని ఒప్పుకున్నట్టు నటించటం వంటివి చేస్తే ‘విశ్వాసం’ కోల్పోతాం.

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏ విషయంలో అయినా మనసుకి పని చెప్పాలి కానీ, మెదడుకి కాదు. అన్నిటికంటే ముఖ్యం భార్యాభర్తల మధ్య నిశ్శబ్దానికి చోటుండకూడదు. ఎందుకంటే నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో కూడినా, తీసివేసినా, భాగించినా, గుణించినా మిగిలేది నిశ్శబ్దమే.. మరి ఆలోచిస్తారు కదూ!

-రమ ఇరగవరపు

Related Segment News