ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు!
posted on Aug 23, 2023 9:30AM
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం.
1. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు
మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు.
2. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు
లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.