జీవితానికి పట్టుదల ఎందుకు అవసరమో తెలిపే విషయాలు...
posted on May 5, 2023 9:30AM
మనిషికి జీవితంలో పట్టుదల అనేది ఎంతో ముఖ్యం. ఈ పట్టుదల అనేది కేవలం మనిషికే కాదు సకల పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ… టిట్టభ అనే పక్షి కథ..
టిట్టభ అనే పక్షి జంట ఒకటి సముద్రతీరంలో గూడు కట్టుకుని ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టినప్పుడల్లా, సముద్రరాజు అలలతో వాటిని ముంచెత్తి, మింగేసేవాడు. సముద్రుని దురాగతాన్ని గమనించిన మగపక్షి, 'సముద్రాన్నే ఎండగట్టి, నా గుడ్లను స్వాధీనపరచుకొంటాను' అంది. ఆ పిట్ట తన ముక్కుతో, రెక్కలతో నిరంతరాయంగా సముద్ర జలాలను భూమిపైకి వేయసాగింది. ఇతర పక్షులు, ఆ మగ టిట్టిభ పక్షి విషయం తెలుసుకొని, తాము కూడా ఈ మహత్తర కృషిలో పాలుపంచుకున్నాయి. పక్షిజాతులన్నీ సమైక్యంగా చేస్తున్న పనిని గమనించి, గద్దలు, రాబందులు మొదలైన పక్షిజాతులన్నీ క్రమంగా ఆ పనికి పూనుకున్నాయి.
ఈ సంగతి విన్న పక్షిరాజు గరుత్మంతుడు కూడా వైకుంఠం వదలి వచ్చి, పక్షి సమూహాలతో చేయి కలిపాడు. వాహనం లేక కష్టపడుతున్న విష్ణువు స్వయంగా సముద్ర తీరం చేరాడు. గరుత్మంతుడు పక్షిజాతుల దైన్యాన్ని తన స్వామికి నివేదించాడు. కరుణామయుడైన శ్రీమహావిష్ణువు సముద్రరాజుకు నచ్చజెప్పి, ఆ తీతువు పక్షి జంటకు గుడ్లను తిరిగి అప్పగించేటట్లు చేశాడు. 'హితోపదేశం'లోని ఈ కథ పట్టుదల ఫలితాన్ని చెబుతుంది. శ్రమశీలికి అపజయం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఇది ఒక పక్షి కథనం మాత్రమే.. మన చరిత్రలో దీనికి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన అబ్రహామ్ లింకన్ 1816 నుంచి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాప జయాలు అంతులేనివి. ఆయన ఎనిమిదిసార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మూడుమార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండుసార్లు వ్యాపారంలో దివాలా తీశాడు. ఆరు నెలల పాటు తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయాడు. పదిహేడేళ్ళ పాటు ఋణగ్రస్తుడిగా గడిపాడు. చివరకు 1860 ఎన్నికలలో గెలిచి, అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన అంత సాధించడానికి ప్రధాన కారణం పట్టుదల, అచంచల దీక్ష.
దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి. అలాంటి వాడు ప్రపంచాన్నే జయించాడు. అందుకు కారణం - ఉక్కు లాంటి చెక్కు చెదరని అతని మనసే!
గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్న డెమస్తనీస్ కు నిజానికి మహా నత్తి. ఆయన నాలుక కింద గులకరాళ్ళు ఉంచుకొని, సాగర తీరంలో కేకలు వేసి, తనకున్న నత్తిని పోగొట్టుకొన్నాడు. మహావక్తగా నివాళులందుకొన్నాడు. సహనం, పట్టుదల వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదగగలిగాడు. ప్రజల ఎగతాళినీ, నిందలనూ లెక్కచేయకుండా బీదవాడైన బెంజిమిన్ డిజ్రేలీ ఇంగ్లండు ప్రధాని కావడానికి కారణం అతని పట్టుదలే. రోమన్ సామ్రాజ్య ఉత్థాన పతనాలు రాయడానికి గిబ్బన్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు.
వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగు వేయడంతోనే ప్రారంభమవుతుంది. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి' అనడంలోని పరమార్థం అదే. అసాధ్యం సాధ్యం కాగలదు. కాబట్టి మనిషి తనలో ఉన్న పట్టుదలను పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరికో సాధ్యం కాలేదు మనకేం సాధ్యమవుతుందిలే.. వంటి నిరాశా వాదాలు వదిలిపెట్టాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.
◆నిశ్శబ్ద.