ఏపీ ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు.. ఇది అసలు మజా

 

ఏపీలో కొద్దిరోజుల్లోనే కొత్త శాసనసభ కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సభలో ప్రమాణం చేయించబోయే ప్రొటెం స్పీకర్ ఎవరనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సాధారణంగా పార్టీలతో సంబంధం లేకుండా అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తుంటారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా ఉండాలా ? వద్దా ? అనేది పూర్తిగా ఆయా సభ్యుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

అయితే ఇప్పుడు ఏపీలో ప్రొటెం స్పీకర్ పదవి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో  అత్యంత సీనియర్ నేత చంద్రబాబే. 2019తో కలుపుకుంటే మొత్తం 9సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించేందుకు నో చెబితే.. వైసీపీకి చెందిన ధర్మాన ప్రసాదరావు, టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు, కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల్లో ఒకరికి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ఓకే కానీ.. ఆయన కాదంటే మాత్రం ధర్మాన వైపు జగన్ మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇప్పుడూ ప్రొటెం స్పీకర్‌గానూ వ్యవహరిస్తారా లేదా అన్నది చూడాలి.