పవన్ వర్సెస్ ఉదయనిథి స్టాలిన్.. ఎవరు బెటరంటే?

లడ్డూ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఏవోవో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనీ వ్యాఖ్యలలో పవన్ కల్యాణ్ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా సనాతన ధర్మం అనడంతో ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే పవన్ కల్యాణ్ ను ఉద్దేశించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యలతో ఒక విధంగా ఇరు రాష్ట్రాల మధ్యా రచ్చకు కారణమయ్యారని చెప్పవచ్చు. 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలకు ఒక సారూప్యత ఉంది. రెండు రాష్ట్రాలలోనూ సినీమా, రాజకీయాలకు విడదీయరాని, విడదీయలేని సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. వీరు తమ పదవీ కాలంలో ఆయా రాష్ట్రాలలో రాజకీయాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలను ప్రభావితం చేశారు. తమిళనాట ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా జయలలిత కూడా తనదైన ముద్ర వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబునాయుడు ముందుండి నడిపిస్తున్నారు. ఇక సినీ రంగం నుంచే రాజకీయ ప్రవేశం చేసిన కరుణానిథి కూడా తమిళనాడు రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. ఆయన వారసుడిగా స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయన కుమారుడు ఉదయనిథి స్థాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులదీ సినీమా నేపథ్యమే. అయితే ఉదయనిథి స్టాలిన్ రాజకీయ ప్రవేశం నుంచి ఎదిగి ఉపముఖ్యమంత్రి పదవీ చేపట్టడం వరకూ ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండదండలు, మార్గదర్శకత్వం ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయాలలో ప్రతి అడుగూ ఆయనకు ఆయన నిర్దేశించుకుని వేసినదే. ఆయనకు రాజకీయంగా ఎవరి అండదండలూ లేవు.  

2014 ఎన్నికల నాటికే పవన్  కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే అగ్రతాంబూలం అంటూ ఆ నాడు పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అప్పటి ప్రధాని అభ్యర్థి, బీజేపీ నేత మోడీతో కలిసి రాష్ట్రంలో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 

ఇక 2019 ఎన్నికల నాటికి వచ్చే సరికి ఆయన ఎన్నికల బరిలో దిగారు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావడమే కాకుండా, స్వయంగా తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోనూ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ తరఫున గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా  ఆ తరువాత అప్పటి అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేసేశారు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని కూడా తట్టుకుని ఆయన జనసేనను ముందుకు నడిపించారు.  

2024 ఎన్నికల నాటికి గట్టిగా పుంజుకున్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత ఏర్పడేందుకు మధ్యవర్తిత్వం నెరిపారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆ ఎన్నికలలో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పార్టీని గెలిపించి వంద శాతం ఫలితాన్ని సాధించారు.  ఒక రకంగా ఉదయనిథి  తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుని ఎదిగితే.. పవన్ కల్యాణ్ మాత్రం స్వశక్తిని నమ్ముకుని ఒంటరిగా రాజకీయ అడుగులు వేసి ఈ స్థాయికి చేరుకున్నారు.  అందుకే పరిశీలకులు పవన్ కల్యాణ్ ఈజ్ ఫార్ బెటర్ దేన్ ఉదయనిధి అంటున్నారు.