వైసీపీకి కార్యకర్తలు ఏరీ.. ఎక్కడ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి  ఇప్పుడు కార్యకర్తలు కూడా దూరం అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పలుమార్లు నేతల చేత పలికించినా.. ఏపీకి జగనే మళ్ళీ ఎందుకు కావాలని ఊదర గొట్టినా ప్రజల నుండి స్పందన కరువైంది.  వైసీపీ సభలు, సమావేశాలలో ఖాళీ కుర్చీలను చూస్తేనే ఇది అర్ధమైపోతున్నది. నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు ఎన్ని ప్రణాళికలు వేసి మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా ఏదో తూతూ మంత్రంగానే మb అనిపిస్తున్నారు తప్ప పార్టీలో ఉత్సాహం నింపేలా ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మన సంక్షేమం అందింది.. ఆ విషయాన్ని మీరే వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ పెద్దలు ద్వితీయ శ్రేణి నాయకులకు ఎన్నిసార్లు హితబోధ చేసినా వారు అడుగు ముందుకు వేయడానికి సుముఖంగా లేరు.  ఎన్నికలేమో దగ్గరకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సొంత సర్వేల నుండి వివిధ మీడియా సంస్థల సర్వేల వరకూ ఎక్కువ శాతం వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావేనని తేల్చిసిన పరిస్థితి.  మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగానైనా తేల్చేసింది.  

నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం అంటు బటన్ నొక్కుడం వినా మరో పని చేసిన పాపాన పోలేదు.  అదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచే పరిస్థితి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కాక సమయం గడిచే కొద్దీ ఒక్కో వర్గంలో అసంతృప్తి మొదలై పెరుగుతూ వచ్చింది. ఆయన హయాంలో రాష్ట్రంలో దాదాపు అన్ని రంగాలూ నిర్వీర్యం అయిపోయాయి. ఇదిగో మా ప్రభుత్వంలో ఈ రంగాన్ని మెరుగు పరిచాం..   సాధించిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.  అసలు రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే నిర్మాణ, రియల్ ఎస్టేట్, తయారీ , ఫార్మా రంగాలు పూర్తిగా కుదేలైపోయాయి. రోడ్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, త్రాగు సాగు నీటి ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలను అంతో ఇంతో మెరుగు పరచాల్సి ఉన్నా అసలు వాటిని పట్టించుకోకపోవడంతో అవీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిపై ప్రజల నుండి ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం అన్నిటికీ బటన్ నొక్కుడే సమాధానంగా చూపించింది. మంత్రులూ, నేతలూ ప్రజలను బటన్ నొక్కి సొమ్ములిస్తున్నారుగా.. ఇక మాట్లాడకండి అంటూ ప్రజలను గదమాయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పెన్షన్ వదులు కుంటే రోడ్లు వేయిస్తామని కూడా చెప్పారంటే జగన్ హయాంలో పాలన ఎంతగా పడకేసిందో అర్ధం చేసుకోవచ్చు.

జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం వంటివి భూతద్దం పెట్టి వెతికినా కానరాని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన పన్నులతో ప్రజల జేబులు గుల్లయ్యాయి.    సంక్షేమం అంటూ పందేరం చేసిన సొమ్ములన్నీ ఏదో రూపేనా ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేసింది. మళ్ళీ ఆ సొమ్ములనే  బటన్ నొక్కి పందేరం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ జగన్ సర్కార్ ఇప్పటి వరకూ పబ్బం గడిపింది. పైగా దొరికిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టేసి చేసిన అప్పు, అప్పనంగా అమ్మేసి సొమ్ము చేసుకున్న నిధులు ఏమయ్యాయి.. వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కని అంశంగా మారిపోయింది. 

ఫలితంగా ఇప్పుడు ప్రజలలో వైసీపీపై అసంతృప్తి పెరిగిపోయింది. ఎంతటి కరుడుగట్టిన పార్టీ కార్యకర్తకైనా ఒక క్షణంలో తన భవిష్యత్తుపై ఆలోచన వస్తుంది. ఆ క్షణాన తడిమి చూసుకుంటే తన పార్టీ వలన ప్రయోజనం శూన్యం అన్నప్పుడు తనకు తెలియకుండానే జెండా కింద పడేస్తాడు. సరిగ్గా వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నది. అందుకే గత ఎన్నికలలో పార్టీ విజయం కోసం జెండా మోసిన కార్యకర్తలే ఇప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు.  మహా మహులైన నాయకులు అనుకున్న వారు, మంత్రులుగా చక్రం తిప్పిన వారికి సైతం ప్రభుత్వ అసంతృప్తి సెగ తాకుతున్నది. సొంత అడ్డా పులివెందులలో జగన్ కూడా నిరసనలను ఎదుర్కొన్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం అవుతున్నది. అందుకే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కూడా వైసీపీకి కార్యకర్తలు అనేవారు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఓటమి భయాన్ని పరిచయం చేస్తున్నది.