గెలిస్తే విజయయాత్ర.. ఓడితే నా శవయాత్ర.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ అభ్యర్థులలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రచారం చివరి అంకానికి వచ్చిన తరువాత వారి ప్రచార శైలిలో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు తాజాగా చూపుతున్న ఉదాహరణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్  బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి బేలతనం ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా.. తనలోని ఓటమి భయాన్ని కూడా బయటపెట్టేసుకున్నారు. నన్న సంపుకున్నా.. సాదుకున్నా మీరేనని చేతులెత్తేశారు.

బతిమాలుకుంటున్నా, మీ కాళ్లు మొక్కుతా ఒక్క సారి అవకాశమివ్వండంటూ వేడుకున్నారు. అక్కడితో ఆగకుండా ఓటమి పాలైతే భార్యా, బిడ్డతో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనీ, గెలిస్తే జైత్ర యాత్ర చేస్తాననీ, ఓడితే కనుక ఆ మరుసటి రోజు తన శవయాత్ర జరుగుతుందనీ కౌశిక్ రెడ్డి ప్రచార సభలో చెప్పారు. ఆ మాటలు, ఆఉద్వేగం, ఆ  టెన్షన్  కౌశిక్ రెడ్డిలోని ఓటమి భయాన్ని దాపరికం లేకుండా బయటపెట్టేశాయి.

ఆత్మహత్య పేరు చెప్పి సెంటిమెంట్ ను రగల్చాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది డిసెంబర్ 3న తెలిసిపోతుంది. కానీ ఈ విధమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం, ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన చేయడం చూస్తుంటే.. ఆయనకు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తున్నదని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్య గతంలో ఇదే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఈటల అన్న మాటలను స్ఫురింప చేస్తున్నాయనీ, అయితే నాటి ఉప ఎన్నికకూ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికకూ చాలా తేడా ఉందనీ అంటున్నారు.

అప్పట్లో ఈటల బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) వేధింపులకు గురయ్యారు. పార్టీలో పెత్తనాన్ని ధిక్కరించినందుకు పార్టీ నుంచి బహిష్కృతడయ్యారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరుతూ జనం ముందు నిలబడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితి అది కాదు. కౌశిక్ రెడ్డి పార్టీలో ఎలాంటి ఇబ్బందులకూ గురి కాలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారు. ఆయనకు తన  విజయంపై అనుమానాలు లేకుంటే ఈ స్థాయిలో బేలగా ప్రచారం చేసుకోరు.  పైగా తన ప్రత్యర్థి  ఈటలను అనుకరిస్తూ, ఆయన గెలుపు ఫార్ములాగా భావిస్తున్న అదే ఫార్ములాను  ఆయనపైనే ప్రయోగించడాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.