జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయితే.. వాట్‌ నెక్ట్స్‌? 

ఆగ‌స్టు 25. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసులో సీబీఐ కోర్టు తీర్పు. వంద శాంత బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని పిటిష‌న‌ర్ ర‌ఘురామ అంటున్నారు. సీబీఐ సైతం ఎలాంటి కౌంట‌ర్ వేయ‌కుండా కోర్టు విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేయ‌డంతో మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. కేసు ప‌క్కాగా ఉంది. ర‌ఘురామ స‌మ‌ర్పించిన సాక్షాలూ అంతే ప‌క్కాగా క‌నిపిస్తున్నాయి. వాద‌న‌లూ అంతే వాడి-వేడిగా జ‌రిగాయి. బెయిల్ ర‌ద్దు నుంచి జ‌గ‌న్ త‌ప్పించుకోలేర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అయితే.. మ‌రోసారి జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలానే జ‌రిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఇప్పుడిక వాట్ నెక్ట్స్ అనే చ‌ర్చ వైసీపీలో న‌డుస్తోంది. జ‌గ‌న్ జైలుకు వెళితే సీఎం ఎవ‌రు అవుతార‌నే చ‌ర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. 

సీఎం రేసులో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ మ‌నుషులు చెబుతున్న పేర్లు ఒక‌లా ఉంటే.. వైసీపీలో సీఎం స్థాయి ఉన్న నేత‌ల ఆలోచ‌న ఇంకోలా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ రెండు వ‌ర్గాలు కాకుండా.. ఆస‌క్తిక‌రంగా కేంద్రం డైరెక్ష‌న్‌లో త‌మిళ‌నాడు త‌ర‌హా పాలిటిక్స్ జ‌ర‌గ‌బోతున్నాయ‌ని కూడా స‌మాచారం వ‌స్తోంది. ఇలా ఒక సీఎం కుర్చీ కోసం.. మూడు స్థంభాలాట‌ న‌డుస్తోంద‌ని అంటున్నారు. బ‌హుషా.. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసిన పాపం కావొచ్చు.. అది ఈ రూపంలో వెంటాడుతున్న‌ట్టుంది. 

జ‌గ‌న్ జైలుకు పోతే.. ఆయ‌న త‌ల్లి, వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌నే సీఎం అనేది ఒక‌ప్ప‌టి మాట‌. గ‌తంలో ఆయ‌న జైలుకు వెళ్లిన‌ప్పుడు.. అప్ప‌టి వ‌ర‌కూ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు కూడా రాని, స‌రిగా మాట్లాడ‌టం కూడా తెలియ‌ని త‌ల్లిని.. పార్టీ ప్ర‌చారానికి, సానుభూతికి వాడుకున్న సుపుత్రుడు జ‌గ‌న్‌రెడ్డి. ఎవ‌రినీ న‌మ్మ‌క‌పోవ‌డం.. ఎవ‌రి మీదా న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో ఆయ‌న లేక‌పోతే విజ‌య‌మ్మ‌నే సీఎం అనేవారు. కానీ, కుటుంబ క‌ల‌హాల‌తో త‌ల్లి విజ‌య‌మ్మ.. కూతురు చెంత‌కు చేరింది. త‌న‌కు ధైర్యంగా బైబిల్ చేత‌ప‌ట్టుకొని.. త‌న కూతురికి ధైర్యంగా ప‌క్క‌న ఉంటోంది. ఇటీవ‌ల వైఎస్సార్ జ‌యంతికి ష‌ర్మిల‌తోనే క‌లిసి పులివెందుల వెళ్లారు కానీ, జ‌గ‌న్‌ను ప‌ల‌క‌రించ‌డానికి కూడా ఇంట్రెస్ట్ చూప‌లేదు. సో.. సీఎంగా విజ‌య‌మ్మ ఆప్ష‌న్ లేన‌ట్టే అంటున్నారు. 

ఇక ఫ్యామిలీలో ఎక్కువ అవకాశం ఉంది జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తికే. జ‌గ‌న్ న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తి ఆమె ఒక్క‌రే. అయితే, గ‌తంలో జ‌గ‌న్ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు రాజ‌కీయంగా ఎంత అవ‌స‌రం వ‌చ్చినా.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌మ్మ‌లే ముందుకు వ‌చ్చారు కానీ, భార‌త‌మ్మ ఏనాడు రాజ‌కీయాల్లో వేలు కూడా పెట్ట‌లేదు. గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. అలాంటి ఆవిడ‌.. ఇప్పుడు ఏకంగా సీఎం పీఠంపై కూర్చుంటారా? అంటే కాస్త అనుమాన‌మే. కాక‌పోతే, త‌ల్లి-చెల్లి దూర‌మై అనాథ‌గా మిగిలిన జ‌గ‌న్‌కు వేరే ఆప్ష‌న్ లేదు మ‌రి. ఆ లెక్క‌న‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వైఎస్‌ భార‌తి ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టే ఛాన్సెస్ లేక‌పోలేదు అంటున్నారు. 

ఒక‌వేళ ఆమె కాక‌పోతే..? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఎప్ప‌టి నుంచో సీఎం పీఠం కోసం గోతికాడి న‌క్క‌లా కాచుకు కూర్చున్నార‌ట మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. త‌న డ‌బ్బుతోనే జ‌గ‌న్ సీఎం అయ్యార‌నేది పెద్దిరెడ్డి లెక్క‌. త‌న‌కంటే బ‌ల‌మైన నాయ‌కుడు వైసీపీలో ఎవ‌రూ లేరు కాబ‌ట్టి.. జ‌గ‌న్ జైలుకు వెళితే.. ఆ ఒక్క‌ఛాన్స్ త‌న‌కే రావాల‌నేది రామ‌చంద్రారెడ్డి ప్ర‌య‌త్నం. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి నుంచీ.. ఆయ‌న తానే సీఎంన‌నే ఊహ‌ల్లో బ‌తికేస్తున్నార‌ట‌. త‌న‌కు కాలం క‌లిసొస్తుంద‌ని ఆశ‌గా, ధీమాగా ఉన్నార‌ట‌. జ‌గ‌న్ ఇలా జైలుకెళ్ల‌గానే.. రేసులో అంద‌రికంటే ముందుగా ప‌రుగెత్తి.. సీఎం కుర్చీలో కూర్చొనేందుకు పెద్దిరెడ్డి ర‌న్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నార‌ట‌. త‌న దారికి అడ్డొచ్చే ఆశావ‌హుల‌ను ఇప్ప‌టికే సైడ్ చేసేశార‌ని చెబుతున్నారు. 

పెద్దిరెడ్డి త‌ర్వాత అంత‌టి అవ‌కాశం ఉన్న మ‌రో నేత విజ‌య‌సాయిరెడ్డి. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌కు సామంత‌రాజుగా ఉన్నారు. జ‌గ‌న్ జైలుకు వెళితే.. అమ‌రావ‌తికి తానే రాజునంటున్నారు. జైలులో మాత్ర‌మే స‌హ‌చ‌రుడినా.. ముఖ్య‌మంత్రి అర్హ‌త‌లోనూ ఆయ‌న త‌ర్వాత తానేన‌నేది విజ‌య‌సాయి ఫీలింగ్‌. పైగా విజ‌య‌సాయికి కేంద్రం ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయ‌ట‌. అస‌లు జ‌గ‌న్ జైలుకు వెళ్లే ప‌రిస్థితి లేక‌పోతే.. బీజేపీతో కలిసి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచే ఆలోచ‌న కూడా ఉన్న‌ద‌ని అంటుంటారు. అలాంటిది జ‌గ‌నే జైలుకు వెళితే ఇక వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకుంటారా? విజ‌య‌సాయినే సీఎం అవుతారా?

వీట‌న్నిటికీ భిన్నంగా మ‌రో వాద‌న కూడా ఇటీవ‌ల కాలంలో విస్తృతంగా వినిపిస్తోంది. అదే త‌మిళ‌నాడు త‌ర‌హా పాలిటిక్స్‌. ఇది కేంద్రంలోని బీజేపీ డైరెక్ష‌న్‌లో జ‌రిగే రాజ‌కీయ క్రీడ‌. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే పాల‌న‌కు శ‌శిక‌ళ అడ్డురాకుండా ఆమెను జైలుకు త‌ర‌లించి.. రెండాకుల‌ పార్టీని త‌న చెప్పుచేతుల్లోకి తెచ్చుకుంది బీజేపీ. సేమ్ అలానే.. సీబీఐ రూపంలో జ‌గ‌న్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేసి.. జైలుకెళ్లేలా చేసి.. త‌న మ‌నిషిగా తెలంగాణ‌లో రాజ‌కీయం చేస్తున్న ష‌ర్మిల‌ను హుటాహుటిన ఏపీకి తీసుకొచ్చి.. ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెడ‌తార‌ని అంటున్నారు. కేంద్రం నుంచి ఆమెకు కావల‌సిన స‌హాయ‌స‌హ‌కారాలు అందించేలా, వైసీపీని త‌మ గుప్పిట్లో ఉంచుకునేలా.. క‌మ‌ల‌నాథులు స్కెచ్ వేశార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. 

ఇలా జ‌గ‌న్ జైలుకెళితే.. వాట్ నెక్ట్స్‌? అనే ప్ర‌శ్న‌కు అనేక ఆప్ష‌న్ వినిపిస్తున్నాయి. వీటిలో ఏది జ‌రుగుతుందో.. చెప్ప‌డం క‌ష్ట‌మే. ఇందులో ఏదీ జ‌ర‌గ‌కుండా.. వారిలో వారు కుమ్ములాడుకొని.. ప్ర‌భుత్వం ప‌త‌నమై మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. అదే జ‌రిగితే.. రాజ‌కీయం మ‌రింత రంజుగా మార‌డం ఖాయం. అయితే, సీబీఐ కోర్టు బెయిల్ ర‌ద్దు చేస్తే.. హైకోర్టుకు ఆ త‌ర్వాత సుప్రీంకోర్టుకు జ‌గ‌న్ అప్పీల్ చేసుకోవ‌చ్చు. కానీ, సీబీఐ తీర్పును ఆధారంగా చేసుకొని నైతిక‌త ప్రాతిప‌దిక‌న ప్ర‌భుత్వం ప్ర‌మాదంలో ప‌డొచ్చు. మొత్తం మీద‌.. ఇటు ప్ర‌భుత్వాన్ని, అటు వైసీపీని.. హోల్‌సేల్‌గా దిమ్మ‌తిరిగేలా దెబ్బ కొడుతున్న ర‌ఘురామ‌.. ఈ ప‌రిణామాల‌న్నిటినీ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు కాబోలు...