షర్మిల అరెస్టుపై అమ్మ స్పందనేదీ?
posted on Feb 23, 2024 9:12AM
వైఎస్ విజయమ్మ.. ఒకప్పుడు వైసీపీ గౌరవాధ్యక్షురాలు. ఏపీ సీఎం జగన్ కన్నతల్లి. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సైతం కన్నతల్లి. సొంత అన్నతో విభేదాల కారణంగా తెలంగాణకు వలస వెళ్లి వైఎస్సీర్టీపీ ఏర్పాటు చేసుకున్ షర్మిలకు మద్దతుగా అమ్మ విజయమ్మ కూడా కుమారుడు జగన్ ను వీడి కుమార్తె వద్దకు చేరారు. అంతే కాదు వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు. ఇక కుమార్తె షర్మిలకు మద్దతుగా ఆమె తెలంగాణలో పోరాటం కూడా చేశారు.
అప్పటి తెలంగాణ ప్రభుత్వం షర్మిలను అరెస్టు చేసిన సమయంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు కూడా దిగారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేశారు. ఓ సారి పోలీసులు షర్మిలను నివాసం నుంచి బయటకు రాకుండా ఆపిన సందర్భంగా విజయమ్మ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చేయి చేసుకున్నంత పని చేశారు. వైఎష్ బిడ్డ బిడ్డను ఆపుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వాస్తవంగా తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రిగా రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం షర్మిలపై ప్రయోగించిన నిర్బంధకాండ కంటే రెండింతలు ఎక్కువగా ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం షర్మిలపై ప్రయోగిస్తోంది.
తెలంగాణలో ఆమెను నిలువరించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా దూకుడును ప్రదర్శిం చలేదు. ఆమెతో గౌరవంగా వ్యవహరించారు. అయితే ఏపీలో మాత్రం షర్మిలకు అటువంటి గౌరవం ఇవ్వడం లేదు. ఏపీలో ఉన్నది సొంత అన్న నేతృత్వంలోని ప్రభుత్వమే అయినా, ఇక్కడ షర్మిల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. బుధవారం షర్మిలను అరెస్టు చేస్తున్న సందర్భంగా ఆమె స్వల్పంగా గాయపడ్డారు కూడా. మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. ఇందు కోసం విజయవాడ చేరుకున్న షర్మిల కేవీపీ ఇంట్లో బస చేశారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో ఆమె వెంటనే కాంగ్రెస్ కార్యాలయానికి తన బసను మార్చేశారు.
బుధవారం ఉదయమే.. అక్కడ ఉన్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత షర్మిల ధర్నా చేసి.. సెక్రటేరియట్ కు బయలుదేరారు. దారిలో వందల మంది పోలీసులు మోహరించి ఆమెను అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. దురుసుగా తీసుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడేశారు. తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి.. తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు. పాలనే చేత కాని జగన్ తనపై పోలీసులతో దాడి చేయించారని విమర్శించారు.
షర్మిల విమర్శలు, ఏపీ ప్రభుత్వం షర్మిల పట్ల వ్యవహరిస్తున్న తీరు పక్కన పెడితే.. తెలంగాణలో షర్మిలను నిలువరించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపునిస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించిన అమ్మ విజయమ్మ ఇప్పటి వరకూ స్పందించకపోవడంపై పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమె జగన్ చర్యలను ఖండిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కొడుకు తీరు పట్ల వ్యతిరేకిస్తారా? లేక కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తారా చూడాల్సి ఉంది.