రేవంత్ వ్యూహం అదుర్స్.. బీజేపీ, బీఆర్ ఎస్ లో ఆందోళన
posted on Feb 23, 2024 9:27AM
తెలంగాణలో కాంగి‘రేసు’ వేరే లెవెల్లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చురుకైన వ్యూహాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. టీపీసీపీ ప్రెసిడెంట్‌గా, సీఎంగా ద్విపాత్రాభినయం చేస్తున్న రేవంత్ రెడ్డి.. రెండు పాత్రల్లోనూ తనదైన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే కొత్తకొత్త నిర్ణయాలు, వ్యూహాలతో ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెడుతున్నారు. మూడురోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొస్గీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగం కార్యకర్తల్లో కొత్త జోష్ ను నింపింది.
యుద్ధం ముగియలేదు, అసలైన యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది. విశ్రాంతి వద్దు. కదనరంగంలోకి దూకండి అంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాల్సిందేనని, ఆ మేరకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలంటూ రేవంత్ సూచించారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్థులను సైతం రేవంత్ ప్రకటించేస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచందర్ పేరును రేవంత్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రేవంత్ దూకుడు, వ్యూహాలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రజల ఇబ్బందులను తొలగించే విధంగా రేవంత్ పాలన సాగుతుండటంతో గ్రామ స్థాయిలో పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీలకు మద్దతుగా నిలిచిన వారిలో అధికశాతం మంది.. రేవంత్‌రెడ్డి పాలనను మెచ్చి కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయమైనట్లేనని పలు సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రెండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ప్రజల నుంచి మద్దతు పెరగడంతో బీఆర్ ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు, ద్వితీయ శ్రేణి నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ దూకుడు పాలన తీరు నచ్చి మెచ్చి పార్టీ నుంచి కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యూహాలకు తిరుగులేకుండా ఉండేది. కానీ, అధికారం కోల్పోయాక.. కేసీఆర్ వ్యూహాలను రేవంత్ చిత్తుచేస్తున్నారని బీఆర్ ఎస్ నేతలుసైతం అంగీకరిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ తొమ్మిది నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో , మజ్లిస్ ఒక నియోజకవర్గంలో విజయం సాధించాయి. ప్రస్తుతం బీఆర్ ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. దీనికి తోడు కొందరు ముఖ్యనేతలు బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అంతే ఇటీవల పలు సంస్థలు వెల్లడించిన సర్వేల్లో బీఆర్ ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో రెండు నుంచి మూడు పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తేలింది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో ఆ పార్టీకి 10 నుంచి 12 నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. బీజేపీకి మూడు నుంచి నాలుగు, మజ్లిస్ కు ఒక పార్లమెంట్ స్థానం దక్కే అవకాశం ఉందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. అయితే, కొస్గీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 14 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలని, ఆ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తనదైన రీతిలో పాలన సాగిస్తున్నారు. గత బీఆర్ ఎస్ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూనే.. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రేవంత్ దూకుడుతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేసేది. దీంతో ఆలస్యంగా అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యేవి. కానీ రేవంత్ రెడ్డి ఆ విధానానికి స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్.. మరో వారం రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను రేవంత్ పూర్తిచేశారని అంటున్నారు. ఆ మేరకు హైకమాండ్ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందన్న చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. 14 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా రేవంత్, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దుకుడుతో బీఆర్ ఎస్, బీజేపీ నేతల్లో కలవరం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయాలంటూ పార్టీ నేతలు ఆయా పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు బీఆర్ ఎస్, బీజేపీ అధిష్టానాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయంటూ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది.