తిరుమలనూ వదలని జగన్.. రంగంలోకి అమిత్ షా?
posted on Feb 23, 2024 7:55AM
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా.. అమరావతి రాజధానినీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవి రెండూ చాలవన్నట్లు ప్రత్యర్థులపైనా, విపక్ష నేతలపైనా వేధింపులు, కేసులతో రెచ్చిపోయారు. అంతే కాకుండా దేవాలయాలను కూడా వదలలేదు. జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగాయి. పలు దేవాలయాల్లో విగ్రహాల ద్వంసం, రథాల దగ్ధం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తిశ్రద్దలతో కొలిచే తిరుమల వేకంటేశ్వర స్వామివారిని జగన్ ప్రభుత్వం వదల్లేదు. పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తే ఎన్నికల సమయంలో వైసీపీపై బురద జల్లేందుకు ప్రయత్నమని కొట్టిపారేయొచ్చు. కానీ, పవిత్రమైన తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పినది ఎవరో కాదు.. సాక్షాత్తూ స్వామివారి సన్నిధిలో ఏళ్ల తరబడి ప్రధాన అర్చకత్వం చేసిన రమణ దీక్షితులు. ఓ వీడియోలో రమణ దీక్షితులు స్వయంగా మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో హిందువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు చేరడంతో.. నిగ్గుతేల్చేందుకు అమిత్ షా రంగంలోకి దిగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్.. దీంతో తిరుమల కొండపై అన్యమత ప్రచారం పెరిగిందనీ, గుప్త నిధుల కోసం వేట జరుగుతోందని రమణ దీక్షితులు సంచలన విషయాలు వెల్లడించారు. అహోబిలంలో రెండు వందల సంవత్సరాల కిందట కొండ మీద ఒక గుహలో ఓ జియర్ సమాధి అయ్యాడట.. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు నిక్షిప్తం చేశారని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ఉన్న జీయర్ తరువాత వచ్చే రెండో జీయర్ కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జీయర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని, అలాగే అవినాశ్ రెడ్డికోసం చాలాసార్లు హైదరాబాద్ కు తిరుగుతున్నారంటూ రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. రమణ దీక్షలు చెప్పిన సంచలన విషయాలతో హిందువుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నిత్యం గోవింద నామ స్మరణతో భక్తిభావం శోభిల్లే తిరుమల కొండపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు విమర్శలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, చైర్మన్, డైరెక్టర్ లు అన్నీ నియామకాలు ప్రభుత్వమే చేస్తుంది. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ప్రభుత్వ సంస్థలైన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, సీఏజీ చెబితే మేము ఒప్పుకోమని, సమాచార శాఖ చట్టం మేము ఒప్పుకోమని చెబుతుంది. తిరుమల ఆలయంలో అంతకుముందు రాతి బండలు ఉండేవి. అయితే, దానిమీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చని రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెయ్యికాళ్ల మండపం గానీ, దేవ మండపం కానీ, అన్నీ నిధుల కోసమే తవ్వారని, తిరుమల ఆలయంలో లోపలికి క్రేన్ ను తీసుకువెళ్లి గోడలకు డ్రిల్లింగ్ వేసి నాశనం చేస్తున్నారని, ఆగమశాస్త్రం ప్రకారం ఏమీ జరగడం లేదని రమణ దీక్షితులు ఆరోపించారు. శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని, స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ ఎంత మంది ఆలయానికి వచ్చారు.. ఎంత మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం ఎంత అన్న విషయాలను తిరమల తిరుపతి దేవస్థానం ప్రతీరోజూ ఉదయాన్నే వెల్లడిస్తుంది. అయితే హుండీలో ఎంత బంగారం, వెండి వచ్చిందో మాత్రం వెల్లడించడం లేదు. బంగారం, వెండి ఎంత వచ్చిందనే విషయాన్ని ప్రతీరోజూ వెల్లడించాలని స్వామివారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అనీ.. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతుందని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని, స్వామివారికి నైవేద్యం సరిగా పెట్టడం లేదంటూ.. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వీడియో విడుదల చేయడంతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సీరియస్ గా తీసుకున్నారు. రమణ దీక్షితులు చెప్పిన విషయాలపై రామచంద్ర యాదవ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాసైతం రమణ దీక్షితులు వీడియో పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలో విచారణకు ఆదేశాలిచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే జగన్ ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నట్లేనన్న వాదన వినిపిస్తోంది.