ఏపీలో బీజేపీ మౌనం దేనికి సంకేతం? ఒంటరి పోరేనా?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. సుదీర్ఘ కాలం పాటు, మూడు పర్యాయాలు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత ... అన్నిటినీ మించి, రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ టార్గెట్ చేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కన్నా లక్ష్మినారాయణ, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు దేశం పార్టీలో చేరారు.

ఆయన  ఏదో వచ్చిన దారిలో వంటరిగా వెళ్ళి పోలేదు. వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన  పలువురు కీలక నేతలతో సహా తన వెంట వచ్చిన పుచిక పుల్ల సహా అందరినీ ఉడ్చుకు పోయారు. అంతే కాదు  బీజేపీ ఒరిజినల్ క్యాడర్, లీడర్ లను కూడా కన్నా సైకిల్ ఎక్కించారు. నిజానికి ఇది బీజేపీకి పెద్ద షాక్. అసలే ఏపీలో అంతంత మాత్రంగా, అంటే ఉండీ లేనట్లుగా ఉన్న బీజేపీకి కోలుకోలేని దెబ్బ. అయినా  బీజేపీ నాయకత్వంలో చలనం లేదు.  వచ్చేవాళ్ళు వస్తుంటారు.. పోయే వాళ్ళు పోతుంటారు అనే నిర్లిప్త ధోరణి కైపిస్తోంది. రాష్ట్ర నాయకులే కాదు, జాతీయ నాయకులు సైతం, కన్నా రాజీనామా పై స్పందించలేదు. 

నిజానికి కన్నా...  ఎవరికీ చెప్పకుండా, ఎవరితోనూ చర్చించకుండా ఈ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి విషయంలో ఆయన తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోలేదు. నిజానికి, కన్నా తమ అసంతృప్తిని లేఖల రూపంలో అయితే నేమీ, పత్రికలు, మీడియా ద్వారా అయితే నేమి పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని ఢిల్లీకి పిలిపిచుకుంది. మాట్లాడింది. అంతే  ఆ తర్వాత అంతా మౌనం.

ఈ నేపథ్యంలోనే  కన్నా ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని, అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విషయంలో ఏ విధంగా అయితే ఎటూ తేల్చకుండా, అయన తమ దారి తాను చూసుకునేలా చేసిందో, అదే సైలెంట్ స్ట్రాటజీనే కన్నా విషయంలోనూ కంటిన్యూ చేసింది. 

 నిజానికి, అప్పుడే కాదు. ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం మౌనం వీడక పోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అందుకే  కన్నా రాజీనామా విషయంలో బీజేపీ నాయకత్వ ధోరణి, ఒక విధంగా నిండా మునిగినవాడికి చలేమిటన్న విధంగా ఉందని అంటున్నారు. నిజమే  ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏపీలో బీజేపీకి మినిమం స్టేక్ కూడా లేదు. అలాగే, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా బీజేపీకి రాజకీయంగా ఒరిగేదీ లేదు పోయేదీ లేదు.

బహుశా అందుకే కావచ్చు, బీజేపీ  జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని,( రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెండూ బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చాయి, అలాగే, రాజ్యసభలో బిల్లుల  విషయంలోనూ ఉభయ పార్టీలు అప్రకటిత మిత్ర పక్షాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నాయి) టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటించాలనే వ్యూహంతో అడుగులు వేస్తోందనే విశ్లేషణలు వినవస్తున్నాయి. 

నిజానికి, రాష్ట్రంలో మరోసారి టీడీపీ,బీజేపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు 2014లో లాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడుతుందని చాల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇప్పడు తెలుగు దేశం, జనసేన పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలున్నా  బీజేపీ విషయంలో ఆ క్లారిటీ లేదు. 

నిజానికి  ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు అయినా లేదు. సో ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రభావం ఇంచు మించుగా జీరో.. అయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలరాదనే లక్ష్యంతో  తెలుగు దేశం  అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. అయితే, బీజేపీ ఎందుకనో ఏమో, జనసేనతో పొత్తుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేస్తోంది.

మరోవంక జనసేన వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీతో పొత్తు అనివార్యమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజా పరిణామాలను గమనిస్తే  ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. అదే జరిగితే  బీజేపీ ఓటుతో పాటుగా, మోడీ అభిమానులు, కేంద్ర ప్రభుత్వ విధానలను సమర్ధించే మధ్యతరగతి ఓటర్లు ఏం చేస్తారు? ఇదీ ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.