ఎన్నికలు వద్దు... ఎంపికలే ముద్దు..సీబ్ల్యూసీపై కాంగ్రెస్ ప్లీనరీ నిర్ణయం

 పాతికేళ్ళ తర్వాత గత సంవత్సరం (2022) అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీ కుటుంబ బయటి వ్యక్తి మల్లి ఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ లో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర, 2023 జనవరి 30 తేదీన శ్రీనగర్ ( జమ్ము కశ్మీర్) లో ముగిసింది. జోడో యాత్రకు కొనసాగింపుగా, ప్రస్తుతం, హత్ సే హాత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 24) ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో మూడు రోజులపాటు జరిగే  కాంగ్రస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంతోపాటు  పక్కనున్న మధ్యప్రదేశ్‌, తెలంగాణ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఇందుకోసం భావసారూప్య పార్టీలతో జట్టుకట్టే అంశంపైనా ప్లీనరీలో మేధోమథనం సాగించనున్నారు. ఈ ప్లీనరీకి కాంగ్రెస్‌ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు సమాచారం. అయితే, పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా  పార్టీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సభ్యుల ఎన్నికకు సంబంధించి, మళ్ళీ పాత, ‘ఎంపిక’ విదానానికే ఓటేసింది. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ()కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేస్తారని ఆయన వెల్లడించారు. రాయపూర్‌లో  జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ తొలి సెషన్  స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ తదితరులు సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్యవర్గానికి ఎన్నిక వద్దని, నామినేషన్ వేయాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగా జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని సింఘ్వీ తెలిపారు. 

పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటులో పార్టీ నేతతో కలిపి సీడబ్ల్యూసీలో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. 12 మంది ఎన్నిక ద్వారా మరో 11 మంది నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు, ఉండాలని జూనియర్లు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి. 

కాగా ఈ సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరు కాలేదు. మల్లికార్జున్ ఖర్గే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చేందుకే వారంతా సమావేశానికి దూరంగా ఉన్నారని, మిగతా నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సీనియర్ నేతలు చెప్పారు. ఇదిలా ఉండగా రాయపూర్ లో ప్రారంభమైన ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.