ఎన్నికల సంగతి తరువాత.. ముందు కవిత చిక్కులపైనే కేసీఆర్ దృష్టి
posted on Feb 25, 2023 9:01AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు వేటికవిగా దర్యాప్తును వేగవంతం చేసిన క్రమంలో రోజు రోజుకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు చేరువ అవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే స్వయంగా కవిత, బీఆర్ఎస్ లు కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు అయితే.. ఏం చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రులు, నేతలతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య ప్రగతి భవన్ లో అధికారిక ప్రకటనలేవీ లేకుండానే అత్యవసర సమావేశాలు జోరుగా సాగుతున్నాయనీ అంటున్నారు. ఆ సమావేశాల చర్చల సారం ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టయితే ఏం చేయాలి.. లీగల్ గా ఎదుర్కోవడంతో సరిపెట్టకుండా, పొలిటికల్ ఫైట్ ఏ విధంగా చేయాలి అన్న దానిపై వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయ ప్రకటనలు, విమర్శలకు దూరంగా ఉన్న కవిత ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం కూడా వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు.
కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం వెనుక ఒక వేళ డిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తే కేంద్రాన్ని విమర్శించిన కారణంగా కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందంటూ కేంద్రాన్ని తప్పుపట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయడం జరిగితే.. అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి... ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీయే కాకుండా కాంగ్రెస్, వైఎస్సార్టీపీ.. ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై షర్మిల విమర్శల కారణంగానే ఇటీవల ఆమెను రెండు సార్లు అరెస్టు చేశారంటూ వైఎస్సార్టీపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది.
ఇక ఇప్పుడు కవిత అరెస్టు జరిగితే.. కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నందుకే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయాలని భావించినా.. సామాన్య జనంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా తేలికగా తీసుకుంటారా అన్న చర్చ కూడా ప్రగతి భవన్ లో జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక కవితను అరెస్టు చేయడమంటూ జరిగితే లీగల్‌గా ప్రొసీడ్ కావడం? అదే సమయంలో రాజకీయంగా బీజేపీని డిఫెన్స్ లో పడేయడం అన్న అంశాలపైనే ప్రగతి భవన్ లో చర్చలన్నీ కేంద్రీకృతమయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అధినేత.. తన కుమార్తెను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి ఎలా రక్షించుకోవాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఎలా అన్న ఆందోళన కూడా పార్టీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.
లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు, వీటన్నిటినీ మించి కవితను సీబీఐ గత ఏడాది డిసెంబరు 11న సాక్షిగా ప్రశ్నించడం, ఆ తరువాత సీఆర్పీసీ సెక్షన్ 191 కింద మరో నోటీసు జారీ చేయడం, ఇక అక్కడ నుంచి చార్జిషీట్లలో కవిత పేరును ఈడీ, సీబీఐలు పదేపదే ప్రస్తావిస్తుండటంతో ఆమెను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిక్స్ కేంద్ర ద్యాప్తు సంస్థలు ఫిక్స్ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పైగా కవిత మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం ఆరోపణలు ఆమెను చిక్కుల్లో పడేశాయని అంటున్నారు. అదీ కాక ఇప్పటికే కవితకు సన్నిహితులుగా చెబుతున్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులు అరెస్టు కావడంతో ముందు ముందు కవిత కూడా అరెస్టయ్యే అవకాశాలే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక వేళ అదే జరిగితే ఏకకాలంగా న్యాయపరంగా, పొలిటికల్ గా ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహరచనపైనే ఇప్పుడు సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.