రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం గ్యారంటీ!

తెలుగుదేశం రాష్ట్ర భవిష్యత్ కు మాదీ గ్యారంటీ అని ఎలుగెత్తింది. సంక్షేమం అంటే అప్పులు చేసి సొమ్ములు పందేరం చేయడం కాదని ఉద్ఘాటించింది. సంపద పెంచి దానికి పేదలకు అందజేయడమే నిజమైన సంక్షేమం అని కుండబద్దలు కొట్టింది. నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించి.. సంక్షేమం పేర పేదలకు రూపాయి విదిల్చి వంద రూపాయలు దోచేసిన జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది.

నిజమైన సంక్షేమం అంటే ఏమిటో ఆరు హామీల రూపంలో ప్రజల కళ్లకు కట్టేల వివరించింది. రాజమహేంద్ర వరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో సంక్షేమ రంగంలో  ఆరు హామీలు ఇస్తూ.. రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ అని నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. భవిష్యత్ కు గ్యారంటీ పేరిట మినీ మేనిఫెస్టోనూ ప్రకటించారు.  నిరుద్యోగులు, మహిళలు, రైతులకు అండగా, చేదోడువాదోడుగా నిలవడమే కాదు.. ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచిన బీసీలకు కూడా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు.

 ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ,  జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అలాగే  రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదలను ధనవంతులు చేయడం తెలుగుదేశం లక్ష్యమని, అధికారంలోకి రాగానే ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రిచ్ టూ పూర్  పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టే ప్రభుత్వం  ముందడగు వేయనుందని ఉద్ఘాటించారు.  బీసీల  రక్షణ చట్టం తీసుకువచ్చి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇంత వరకూ  26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి అని వెల్లడించిన చంద్రబాబు, వీటిని దృష్టిలో పెట్టుకుని  బీసీలకు రక్షణ చట్టాన్నితీసుకురావాలని తెలుగుదేశం సంకల్పించిందన్నారు.  అలాగే ఇంటింటికీ మంచి నీర  పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ కు తెలుగుదేశం పార్టీ పూచీ పడుతుందని చంద్రబాబు చెప్పారు. 

తెలుగుదేశం ధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ఇక రైతులకు అన్న దాత ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.   మహిళ మహా శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు  స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.  తల్లికి వందనం  పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.  

ఉచిత బస్సు ప్రయాణం  పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.  నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుందని… ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు.  చంద్రబాబు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా జగన్ నవరత్నాలు పథకంలోని డొల్లతనాన్ని అందరికీ అర్ధమయ్యేలా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వాలంటీర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పథకాలను పొందాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం అర్హులందరినీ ఒకే విధంగా చూస్తుందని చెప్పకనే చెప్పారు.

సంక్షేమం అంటే ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటుగా భవిష్యత్ కు భరోసా కల్పించడమని విస్పష్టంగా చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. తెలుగుదేశంకు సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపద ఫలాలను పేదలకు అందించం తెలుసు అని చంద్రబాబు తన ప్రసంగం ద్వారా అందరికీ  స్పష్టం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.