శరీరంలో ఎముకల పాత్ర ఏమిటి?? వాటి వ్యాధులు ఎందుకొస్తాయి??
posted on Jan 10, 2023 9:30AM
కండరాల లోపల ఉన్న ఎముకల గురించి చెప్పుకుంటే అవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడమే కాక, ఒకదానికొకటి కలిసి కదలికలకి ఎంతో ఉపకరిస్తాయి. అన్ని అవయవాలకి ఎముకలు ఆధారాలు. మెదడు, వెన్ను, నరము, గుండె, ఊపిరితిత్తులు మొదలయిన అన్ని అవయవాలకి, ఎముకలు చుట్టూ ఉండి గట్టి రక్షణనిస్తున్నాయి. కార్టిలేజెస్ ఎముకలకి ఆధారాన్నివ్వడమే కాకుండా కలువబడే రూపాలుగా కూడా తోడ్పడుతున్నాయి. బయట చెవి, కార్టిలేజ్ సహకారంతోనే అలా వాలిపోకుండా నిలబడగలుగుతోంది. ఎముకల్ని కలపడానికి లిగమెంట్స్ ఉపయోగపడుతుంటాయి.
ఎముకలు వేటి కలయికతో ఏర్పడుతాయో తెలుసా??
కాల్షియమ్, ఫాస్ఫరస్ లాంటి ఆర్గానిక్ పదార్థాలతోపాటు ఇనార్గానిక్ పదార్థాలు కలవడంతో ఎముకలు ఏర్పడతాయి. వయసు పెరిగేకొద్దీ ఎముకలలోని ఆర్గానిక్ పదార్ధాలు తగ్గిపోతూ ఎముకలు పెళుసుగా తయారవుతాయి. విరిగితే అతకడం కూడా కష్టమవుతుంది. ఎముక విరిగినప్పుడు ఆ విరిగిన భాగాలు ఒకదానికొకటి అతుక్కోవడానికి కొత్త పదార్థాన్ని సృష్టిస్తాయి. ఆ కొత్త పదార్థాలు, కాల్షియం, లవణాలు చేరి క్రొత్త ఎముక ఏర్పడుతుంది. ఎముకల చుట్టూ ఉండే పొరని 'పెరి ఆస్టియమ్' అంటారు. దానిలో ఉండే రక్తనాళాల ద్వారా ఆహారం ఎముకలోకి వెళ్తుంది.
ఒక్కో చెవిలోని మూడేసి చిన్న ఎముకలతో కలిపి, మన శరీరంలో మొత్తం 213 ఎముకలుంటాయి. పుర్రెలో 22, వెన్నుపూసలో 33, పక్కటెముకలు 24, చేతులలో 14, కాళ్ళలో 62, మెడలో 11 చాతి ఎముకలు ఉంటాయి. వీటిలో ఏది విరిగినా కష్టమే. ఎముకలు కలిసే ప్రదేశాల్ని కీళ్ళు అంటారు. ఈ కీళ్ళు శరీరం వంగడానికి ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా వాడితే అంటే ఆ ప్రదేశాలలో కదలిక ఎక్కువగా ఉంటే కీళ్ళు తొందరగా అరిగిపోతాయి. కీళ్ళు అరగడం అందరికీ ఒకేలా ఉండదు. వయసుని బట్టికాక వాళ్ళు వాడే పద్ధతుల్ని బట్టి కీళ్ళు అరిగిపోవడం జరుగుతుంది !
కీళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తతో పాటు ఎముకలు విరిగితే ఏం చేయాలి ఎముకలకి ఎటువంటి రోగాలొస్తుంటాయి? అసలీ ఎముకల జబ్బులు ఎందుకొస్తుంటాయి? మొదలయిన విషయాలన్నీ తెలుసుకుంటే మనం ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.
ఎముకల వల్ల వచ్చే అనారోగ్యాలేమిటో తెలుసుకుంటే..
పోలియో, వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులతో పాటు ఎముకలలో కాన్సర్ రావచ్చు. ఎముకలు విరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. కాల్షియం ఎక్కువైతే ఎముకల జబ్బులొస్తాయి. అలాగే విటమిన్-డి తక్కువైతే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. సూర్యకాంతి తగలకపోవడం శరీరానికి చాలా నష్టాన్ని కల్గిస్తుంది. రెండు సంవత్సరాలలోపు పిల్లలకి సరయిన పోషకాహారం లేకపోతే, ఎముకలు సరిగ్గా పెరగవు.. మూడు సంవత్సరాలకి పైబడ్డ వాళ్ళలో మూత్రపిండాల సమస్యతో ఎముకల జబ్బులొస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మూత్రంలో కాల్షియం పోయి రీనల్ రికెట్స్ రావచ్చు. అప్పుడు ఎముకలు వంకరతిరిగిపోతాయి, మత్తుగా ఉంటారు. పొట్ట పెరుగుతుంది. కాళ్ళు వెడల్పవుతాయి.
మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నా ఎముకలు బలహీనమవుతాయి. అందరినీ ఇబ్బంది పెట్టే.. వాత రోగమూ ఎముకల జబ్బే! స్టిరాయిడ్స్ మొదలయిన వాటిని కొంత మంది వాడుతుంటారు. అప్పుడు ఎముకల్లో కాల్షియం తగ్గి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతాయి. ఒక పద్ధతి ప్రకారం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి. గర్భ కాలంలో శిశువు సరైన స్థితిలో ఉండకపోవడంవల్ల పుట్టే పిల్లల్లో పాదము, మడము కూడా శరీర మధ్య రేఖ వైపు తిరిగి ఉంటాయి. వెంటనే పాదాలు సరైన స్థితిలో ఉండేట్లు స్ప్రింట్ అనే పరికరాన్ని గాని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టుగాని వాడాలి. వయసు పెరిగేకొద్ది కీళ్ళు అరుగుతుంటాయి. అప్పుడు ఆస్టియో ఆర్థ్రయిటిస్ అనే జబ్బు వస్తుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుంది.
ఇలా ఎముకలకు సంబంధించి నిత్యజీవితంలో ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
◆ నిశ్శబ్ద.