మనకు పీచుపదార్థం ఎందుకు అవసరం??

మనిషి తీసుకునే ఆహార పదార్థంలో చాలా రకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, ద్రవాలు, పీచు ఇలా పదార్థంలో అంతర్లీనంగా చాలా ఇమిడి ఉంటాయి. అయితే తీసుకునే ఆహారపదార్థాలలో పీచు అధికంగా ఉన్న ఆహారం చాలా మంచిదని, ఇది ఆరోగ్య వ్యవస్థను చాలా దృఢంగా ఉంచుతుందని అంటారు. 


అయితే… ఆహార పదార్థాలలో వుండే పీచుపదార్థం అనేది మొక్కలకు సంబంధించిన భాగం అని చెప్పవచ్చు. ఈ పదార్థం మనుషులకు సంభవించే కొన్ని అతి ముఖ్యమైన తీవ్రవ్యాధులను  అరికట్టడంలో  చాలా బాగా సహపడుతుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణకోశంలో  చాలా త్వరగా ప్రయాణించగలుగుతాయి. అందువల్ల ఆహారంలోని ప్రమాదకరమైన పదార్థములు దేహంలో శోషణ చెందడానికి ఎక్కువ సమయం ఉండదు. 


ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల, ద్రవ పదార్థాల వల్ల కలిగే పైత్య వికారాలను ఈ పీచుపదార్థం బంధించి ఉంచుతుంది. అందువల్ల ఆ పైత్య సంబంధ కారకాలు శరీరంలోకి శోషణ కావు. అంతేగాక మనం తీసుకునే ఆహారంలో దాసగి ఉండే కొలెస్ట్రాల్ నుండి క్రొత్త పైత్య క్షారాలు విడుదల అవుతాయి. ఈ క్షారాలు శరీరంలో కలవకముందే పీచుపదార్థంతో కలిసిపోయి వాటిద్వారానే బయటకు వెళతాయి.  


శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే.. దానికి చక్కని ఉపాయం పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. పీచు పదార్థం కొలెస్ట్రాల్ కంటెంట్ ను శరీరంలో నుండి ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. అందుకే అధికబరువు ఇన్నవారిని పీచుపదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని సలహా ఇస్తుంటారు.  దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే తొందరగా కడుపు నిండిన ఫీల్ వస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువగా సమయం పడుతుంది కాబట్టి ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక రెండవది పీచుపదార్థం శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గిస్తుంది.


పీచుపదార్థం కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల రక్తనాళాలు గట్టిపడి అవి  పూడుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది. కొవ్వును పెరగకుండా అదుపు చెయ్యటంలోను కొలెస్ట్రాల్ నుండి పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళని అరికట్టడంలోను పీచుపదార్థం ఎంతగానో సహాయ పడుతుంది. కొందరిలో వంశానుగతంగా  డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఈ డయాబెటిస్ ని పీచు పదార్థాలు అధిక శాతంలో గల ఆహారము తీసుకోవడం ద్వారా చాలావరకు నిరోధించటానికి అవకాశము ఉంటుంది. 


కొందరికి ప్రేవులలో అధిక ప్రకంపనలు (వత్తిడిలు) జరగటంవల్ల అవి జారి హెర్నియా వ్యాధికి లోనవటం సంభవిస్తుంది.అదే పీచు పాడ్స్ర్తం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే..  పీచుపదార్థం ప్రేవులలో సులువుగా ప్రయాణించడం ద్వారా ప్రేవులలో వత్తిడులను  అరికట్టడంలో తోడ్పడుతుంది.


ఇక ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని ఉత్పత్తిచేసే “కార్సినోజినిక్”లను శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధించటానికి పీచుపదార్థాలు చాలా సహాయపడతాయి. జీర్ణకోశంలో ఆహారం ఎంత ఆలస్యంగా ప్రయానిస్తే అంత ఎక్కువగా ప్రేవులలో ఒత్తిడులు సంభవిస్తాయి. ఈ ఒత్తిడుల కారణంగానే కార్సినోజినిక్ లు పుట్టడం జరుగుతుంది. అందుకే.. కావలసినంత పీచుపదార్థం శరీరంలో ఉన్నప్పుడు జీర్ణంకోశంలోని ఆహారాన్ని త్వరితంగా ప్రయాణింపజేసి, ప్రేవుల మధ్య ఒత్తిడులు అరికట్టడంద్వారా క్యాన్సర్ కు  కారణమైన కార్సినోజినిక్ ల ఉత్పత్తికి విఘాతం కలిగించి క్యాన్సర్ వ్యాధిని నిరోధించగలుగుతుంది. 


అందువల్ల మనుషులు తీసుకునే ఆహారంలో అధిక శాతం పీచులేక నార పదార్థం గల ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆహారంలో పీచుపదార్థం పుష్కలంగా ఉండాలంటే బియ్యం గోధుమలు వగైరా ధాన్యాలను పొట్టు తీయకుండా పిండి పట్టించుకుని వాడుకోవాలి.  ధాన్యాలను ఎక్కువసార్లు కడగకూడదు. కొన్ని కూరగాయలు పచ్చిగా తినడానికి అనువుగా ఉంటాయి. అలాంటి కూరగాయలను పచ్చివిగా తినటం మంచిది. కూరగాయలను తప్పనిసరిగా ఉడికించవలసివస్తే మూతపెట్టి కొద్దిసేపు మాత్రమే ఉడికించాలి. కూరలను ఉడికించినప్పుడు ఆ నీటిని పారేయకుండా వాటిని సూపులు, రసం, చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా వాడటం వంటి మార్గాల ద్వారా వాటిని కూడా ఆహారంగా సేవించే విధానం ఏర్పరచుకోవాలి. ఈ విధంగా క్రమపద్ధతిలో ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత పీచుపదార్థం లభిస్తుంది.


                                   ◆నిశ్శబ్ద.