కేసీఆర్ భంగపాటు పర్యవశానమేమిటంటే..?

గవర్నర్‌ వ ర్సెస్‌ గవర్నమెంట్‌ అంశంలో కోర్టుకు వెళ్లి  భంగపడి కేసీఆర్ సాధించినదేమిటన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. బడ్జెట్‌ను ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు పంపిన లేఖపై.. గవర్నర్‌ తమిళసై ఎంతకూ స్పందించకపోవడాన్ని  కేసీఆర్‌ సర్కారు  సవాల్ గా తీసుకుంది.  రాజ్‌భవన్‌ నుంచి స్పందన లేకపోవడం అవమానంగా భావించింది.  బడ్జెట్‌ ఆమోదించకపోతే రాగల సమస్యలను దృష్టి ఉంచుకుని  గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. ప్రతిష్టకు పోయి ముందు వెనుకలు ఆలోచించకుండా దూకుడు ప్రదర్శించింది.

లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్‌..  తన వైఖరికి భిన్నంగా   చివరి వరకూ పోరాడకుండా  మధ్యలోనే అస్త్ర సన్యాసం చేశారు. ఇది ప్రజలలో బీఆర్ఎస్ పరువునే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరువునూ మసకబార్చింది. గవర్నర్ విషయంలో కేసీఆర్ దుందుడు వైఖరి అంతిమంగా గవర్నర్ ను విజేతగా నిలిపింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేసిన ధీరురాలిగా ప్రజలలో ఆమె ఇమేజ్ పెంచింది.  ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గవర్నర్ వ్యవస్థ కారణంగా ఇబ్బందులు పడుతున్న బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలూ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేసీఆర్ ఈ పోరాటంలో విజయం సాధిస్తే తామూ అదే బాట పట్టాలని భావించారు.

కేసీఆర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఫలితం ఏలా వచ్చినా కేసీఆర్ చివరి వరకూ నిలబడతారని కూడా ఆశించారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా మధ్యలోనే అస్త్రసన్యాసం చేసి పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.  అక్కడితో అయిపోలేదు.. ఈ కేసు విషయంలో రాజ్ భవన్ అన్ని విధాలుగా పై చేయి సాధించింది. ఇప్పట్లో గవర్నర్ వ్యవస్థపై ఎవరూ కూడా ధిక్కార ధోరణి ప్రదర్శించాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం కల్పించింది. ప్రభుత్వంలో ఉన్న వారు గవర్నర్‌ను విమర్శిస్తున్నారంటూ, గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టు కు చెప్పారు. దీంతో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది   ఇకపై గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి చెబుతానంటూ  సమాధానం ఇచ్చారు. అంటే గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడిపోయారో అర్ధమౌతుంది.  గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలను నేను కూడా ఖండిస్తా. అలాంటి మాటలు సరికాదు. ఆమె ఒక మహిళ అని ఆమెను విమర్శించేవారు గుర్తించాలి.

మహిళను గౌరవించాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా’నని.. దవే వినయపూర్వకంగా హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో గవర్నర్ పైనా, గవర్నర్ వ్యవస్థపైనా ఇంత కాలం బీఆర్ఎస్ చేస్తూ వచ్చిన విమర్శలన్నిటికీ కేసీఆర్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసినట్లే అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించగా, గవర్నర్‌ తన రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ న్యాయవాది చెప్పారు. అంతే విచారణను కోర్టు ముగించింది.

ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సాధించిందేమైనా ఉందంటే.. అది తన అశక్తతను చాటుకోవడం మాత్రమే. వ్యూహ రహితంగా అహంకారంతో  వ్యవహరిస్తే తలదించుకోకతప్పదని చాటడమే.   గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఆ విషయంలో  న్యాయపరమైన అధ్యయనం లేకుండా వ్యవహరించి తన ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టనూ కూడా మసకబార్చుకున్నారు.   గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోకుండా.. న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు  బావిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్న నేతగా కేసీఆర్,  గవర్నర్‌ చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్నికొనసాగించి ఉంటే..  ఆయనకు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల మద్దతు పెరిగి ఉండేది.  జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు వచ్చి ఉండేది.  అయితే కేసీఆర్ పిటిషన్‌ ఉపసంహరణతో ఆ అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్నారన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతోంది. జాతీయ రాజకీయాలలో ఎదగాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ పరిణామం ఒక ఎదురు దెబ్బేనని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ కు మద్దతు విషయంలో పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని పరిశీలకులు సైతం అంటున్నారు.