సివిల్ సర్వెంట్ల కేటాయింపు కేసు విచారణకు రాకపోవడంపై అనుమానాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కి వెళ్లినా.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. తెలంగాణలోనే కొనసాగుతున్నారు.  డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ( క్యాట్‌)కి వెళ్లి స్టేతెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.  సోమేశ్‌ కుమార్ విషయమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆ అధికారుల పరిస్థితి ఏమిటన్న అంశంపై చర్చ మొదలైంది. తెలంగాణలో పని చేస్తున్న 12 మంది ఏపీ క్యాడర్ సివిల్ సర్వెంట్ల కేటాయింపుపై  ఈ నెల 27న హైకోర్టులో వాచారణకు రావాల్సి ఉండగా ఇంత వరకూ రాలేదు.  

12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్  విచారించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని   అభిప్రాయడింది. అన్ని పిటిషన్ లను  రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది. అయితే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని  అధికారుల తరపు న్యాయవాదులు  కోర్టుకు  తెలుపగా తదుపరి విచారణను 27 కు వాయిదా వేసింది. అయినా ఆ కేసు విచారణకు రాలేదు. ఎందుకు రాలేదన్నదానిపై పలు అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. 

ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్​ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్​లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్, ఏవీ రంగనాధ్ ఉన్నారు. ఐఏఎస్‌లలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీ ప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్​ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి (ప్రస్తుతం సెంట్రల్ డిప్యూటేషన్) ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్​లో పనిచేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌‌కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకూ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  అయితే ఈ కేసు విచారణకు బెంచ్ మీదకు రాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ఇక సోమేష్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే కోర్టు తీర్పు మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయారు. అక్కడ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వాస్తవానికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉన్నా సోమేష్ కుమార్ ఆ పని చేయలేదు. అసలు కోర్టు తీర్పు రాగానే ఆఘమేఘాల మీద సోమేష్ కుమార్ ను రిలీవ్ చేయడానికి కారణం  గత కొంత కాలంగా సీఎస్ సోమేష్ కుమార్ తీరు పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉండటమే కారణమని అంటున్నారు.   న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశించినా సోమేష్ కుమార్ పట్టించుకోలేదని,  అలాగే ధరణి పోర్టల్ లో లోపాల సవరణ విషయంలో కూడా ఆయన స్పందన పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతారు.

అన్నిటికీ మించి ఒక స్థలం విషయంలో మంత్రి కేటీఆర్, సోమేష్ కుమార్ మధ్య విభేదాలు కూడా సోమేష్ రిలీవ్ విషయంలో ముఖ్యమంత్రి వేగంగా నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు. అందుకే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా సోమేష్  ఆ దిశగా ఆలోచన చేయలేదనీ, ఏపీకి వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ లో పని చేస్తున్న ఏపీ కేడర్‌కి చెందిన అధికారులకు కూడా సోమేష్ అంశాన్ని బూచిగా చూపి వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుంటే అదే జరుగుతుందన్న సందేశాన్ని కేసీఆర్ ఇచ్చినట్లైందని అంటున్నారు.