నిర్బంధ కాలాన్ని నమోదు చేసిన పదమూడేళ్ళ అమ్మాయి కధ

దాదాపుగా అందరమూ ఒక గూటిలో ఉండగలుగుతున్నాం. తింటూ, కాసేపు కునుకు తీస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కరోన భయంలో మరింత దైవ చింతనలో ఉంటూ, రేపటి గురించిన చింతతో మొత్తానికి గడిపేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి, చవకగా డేటా కూడా దొరికింది కాబట్టి ఏదో ఆసక్తి కలిగించేదో చూసే/చేసే అవకాశం దొరికింది. 
కానీ కాలం గడిచే కొద్దీ ఒక విసుగు... ఎప్పుడు బయటపడతామా అని ఆలోచనలు. కానీ ఒక అనివార్యమైన సుదీర్ఘ కాలం ఇప్పటిలా 6 గంటల నుంచి 9 గంటల వరకు మనకు కావలసినవి దొరికేల కాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని ఉహించండి. భయమేస్తోంది కదా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపుగా యూరోప్  అంతటా హిట్లర్ నాజీ సైన్యం యూదులపై జరిపిన జాతి హననము ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక విషాద ఘట్టం. 

ఈ నేపద్యంలో ఒక పదమూడేళ్ల అమ్మాయి తన కుటుంబంతో సహా దాదాపుగా రెండేళ్ల పైబడి హిట్లర్ రహస్య సైనిక విభాగం గెస్తపో నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని నమోదు చేసుకున్న ఒక సాక్ష్యం "the diary of Anne frank".
 
రెండేళ్లపాటు కుటుంబమంతా ఒక చీకటి గుహ లాంటి ఆఫీస్ క్రింద భాగాన్ని మరో కుటుంబంతో కలిసి జీవించడాన్ని ఉహించండి. విభిన్న మనస్తత్వాలు కల్గిన వ్యక్తులు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్న స్పృహతో సేకరించి పెట్టుకున్న అతి తక్కువ ఆహార పదార్ధాలు తో చీమ చిటుక్కుమంటే భయం, లోగొంతుకతో తప్ప మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో గడపడాన్ని ఉహించండి. ఇంత దుర్భర పరిస్థితుల్లో తమకు తాము మంచే జరుగుతుందన్న ఆశను కోల్పోకుండా రోజులను గడపడాన్ని పదమూడేళ్ళ అమ్మాయి తన డైరీ "kitty" తో చెప్పుకుంటూ రాసుకుంది. 

రెండేళ్ళ తర్వాత అందరూ పట్టుబడేంతవరకు అన్నే ఫ్రాంక్ రాసుకున్న డైరీ అప్పటి జాతి హనన పరిస్థితులకు సాక్ష్యంగా నిలిచింది.  దురదృష్టవశాత్తు అన్నే ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మినహా మరెవ్వరూ హిట్లర్ నుంచి తప్పించుకోలేక పోయారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్ళను నిర్బంధంలోకి తీసుకునేప్పుడు ఏదో పనికిమాలిన పేపర్లుగా భావించి అదొక సాక్ష్యమే కాదన్నట్లుగా వదిలేసిన డైరీ ఒక గొప్ప సాక్ష్యంగా చరిత్రలో మిగిలింది. అన్నే ఫ్రాంక్ తండ్రి విడుదలైన తర్వాత ఈ డైరీ ని ప్రచురించడం జరిగింది. తర్వాత అనేక ప్రచురణలు పొందడం, ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువాదం పొందడం, సినిమాలుగానూ, టెలిఫిల్మ్స్ గానూ రావడం జరిగింది. 

ఈ స్వీయ నిర్బంధ కాలంలో ఈ పుస్తకాన్ని చదవడం ఒక ఓదార్పు మనకు. ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకోవడం లాంటిది. ముఖ్యంగా పడమూడేళ్ళ అమ్మాయి ఆలోచనల్లోంచి ఒక సంక్షోభ కాలాన్ని చూడడం, వాళ్ల కలలు, సమస్యలు, పరిణితి అర్ధం చేసుకోడం నిజంగా బాగుంటుంది.