భార్య, కుమారుడితో కలిసి సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్
posted on Apr 12, 2025 12:26AM

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దంపతులు తమ కుమారుడు మార్క్ శంకర్ ను తీసుకుని సింగపూర్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్నపవన్ విషయం తెలియగానే విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.
సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ కోలుకుని డిశ్చార్జ్ కాగానే పవన్ కల్యాణ్ తన కుమారు, భార్యతో కలిసి శనివారం రాత్రి 11 గంటల సమయంలో సింగపూర్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మార్క్ శంకర్ అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు. అతడి కోసం పవన్ భార్య లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓ వైపు పార్టీ, మరో వైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో పవన్ సింగపూర్ వెళ్లలేదు. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా…సింగపూర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. అయినా కూడా గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారు.
అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడమే కాకుండా అగ్ని ప్రమాదం సందర్భంగా అలుముకున్న దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డాడు, దీంతో సింగపూర్ ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స తీసుకున్నాడు. అనంతరం గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. ఆ తర్వాత శనివారం పవన్ కల్యాణ్ తన భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చారు.
